ఆ ముగ్గురూ మోడీ పక్షమే

ఆ ముగ్గురూ మోడీ పక్షమే– ఏపీలో ఉన్నదంతా పాలకపేు
– కడప ఎంపీ ఉప ఎన్నిక వస్తే గల్లీ గల్లీ తిరుగుతా : మంగళగిరిలో వైఎస్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌… ఈ ముగ్గురూ మోడీ పక్షమేనని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. సోమవారం ఏపీలోని మంగళగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదనీ, అంతా పాలకపక్షమేనని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్నది కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాత్రమేనని చెప్పారు. 1999లో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పోషించిన పాత్రను ప్రస్తుతం షర్మిల పోషిస్తున్నదని అభివర్ణించారు. వైఎస్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయనకు నిజమైన వారసులవుతారు… అంతే గానీ ఆయన పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవారు కాదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలను కొనసాగించేందుకు ముళ్ల బాటను ఎంచుకున్న షర్మిలకు తామంతా అండగా నిలబడేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి వచ్చినట్టు తెలిపారు. కడప లోక్‌సభ సీటుకు ఉప ఎన్నిక వస్తే ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి తానే వస్తానని రేవంత్‌ తెలిపారు. 2029లో ఏపీలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందనీ, దేశానికి రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైఎస్‌ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నదని రేవంత్‌ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులున్న వైఎస్‌ఆర్‌, చట్టసభలకు కొత్త వారు వస్తే ప్రోత్సహించే వారని గుర్తుచేశారు. ప్రతి పోరాటానికీ ఒక సమయం వస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నిజమైన నివాళి : భట్టి విక్రమార్క
రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆ దిశగా రెండు రాష్ట్రాల కాంగ్రెస్‌ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌ తనకు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశమిచ్చి రాజకీయ ఓనమాలు నేర్పించడం వల్లే తాను ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని విక్రమార్క ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్‌ ప్రజల హదయాల్లో నిలిచిన నాయకుడని కొనియాడారు. పాలకులు ఎలా ఉండాలో చూపించిన గొప్ప నాయకుడని కీర్తించారు. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిన మార్గదర్శకుడు, పాదయాత్రలో రైతుల బాధలు చూసి ఉచిత విద్యుత్‌ కోసం తొలి సంతకం చేసిన దార్శనికుడు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ తెచ్చిన విద్యావేత్త వైఎస్‌ఆర్‌ అని తెలిపారు. ఆయన ఆలోచన, మాటలు, వేసిన బీజాలు నేడు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని భట్టి తెలిపారు.
వారే వైఎస్‌కు నిజమైన వారసులు : గాంధీభవన్‌ వైఎస్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి అందించిన సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలకూ వైఎస్‌ స్ఫూర్తి అని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా వై.ఎస్‌ పని చేశారని గుర్తుచేశారు.
ఆ లక్ష్యం కోసం కృషి చేసే వారే వైఎస్‌కు నిజమైన వారసులని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో నిర్వహించిన వైఎస్‌ 75వ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ తదితర నాయకులతో కలిసి సీఎం పాల్గొన్నారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రే …రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి రాహుల్‌ యాత్ర కారణమైందని తెలిపారు. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన రాణిస్తున్నారని చెప్పారు. ప్రధాని పదవికి రాహుల్‌ ఒక అడుగు దూరంలో ఉన్నారనీ, ఆయన ప్రధాని కావడం చారిత్రక అవసరమని అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కష్టపడి రాహుల్‌ను ప్రధాని చేయాలని సూచించారు. ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లే వారు వైఎస్‌ వారసులు కాబోరని స్పష్టం చేశారు. మూడేండ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని రేవంత్‌ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా 35 మందికి కార్పొరేషన్‌ పదవులు ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌ బాబు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ప్రజాభవన్‌లో వైఎస్‌ఆర్‌ ఫొటో ప్రదర్శన
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితానికి సంబంధించిన ఫొటో ప్రదర్శనను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దీపాదాస్‌ మున్షీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీఎల్పీ కార్యాలయంలో
వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో గల సీఎల్పీ కార్యాలయంలో రేవంత్‌ ఆయనకు నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్‌ విగ్రహానికి సీఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love