రాష్ట్రంలో మూడు రోజులూ మండుటెండలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండలు మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణం. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచి అయిదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు కరీంనగర్‌లోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ తంగేల్ల మధుకుమార్‌(41), ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తులిస్యాతండాలో ఉపాధి కూలీ వాంకుడోతు సునీత(40) వడదెబ్బతో మృతి చెందారు.