ఎన్నో ఏండ్ల కల… దశాబ్దాల నాటి పోరాటం… యాస, భాష, సంస్కృతి పునరుజ్జీవానికై పోరు… ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. అన్నింటా తామై మాట, పాట, ఆటలతో ఉద్యమానికే ఊపిరి పోసింది మహిళా లోకం. ఉత్పత్తిలోనే కాదు పోరాటాల్లోనూ సగభాగమయ్యారు. ఆత్మగౌరవ పతాకాన్ని రెపరెపలాడించారు. అలాంటి మహిళల జీవితాలు తొమ్మిదేండ్ల స్వరాష్ట్రంలో ఎలా ఉన్నాయో, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పోరాడిన కొందరు మహిళా ప్రముఖులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
మహిళా ప్రాధాన్యం మరింత పెరగాలి
అనేక కష్టనష్టాలకు ఓర్చి దశాబ్దాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసుకున్నాం. ఆనాడు ఆంధ్రుల పెత్తనంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కాలేదనేది జగద్వితం. అందులో భాగమే మహిళల అభివృద్ధి. ఆనాడు మహిళలకు తగిన ప్రాధాన్యం లేదు. ముఖ్యంగా ఇప్పటి ప్రభుత్వంలో కూడా మహిళలకు తగినంత నిష్పత్తిలో ప్రాధాన్యం లేదు. కాబట్టి మహిళలకు 50శాతం మేరకు ఇరు శాసన సభల్లో తప్పక ప్రధాన్యం కల్పించాలి. అన్ని రకాల ఉద్యోగాల్లో ముఖ్యంగా వైద్య, విద్యా రంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరగాలి. అలాగే మంత్రి వర్గంలో మహిళల సంఖ్య పెరగాలి. మహిళల రక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తూ తక్షణ న్యాయం జరిగేట్టు చూడాలి. అన్ని చోట్ల మహిళా గొంతుకు అవకాశాశమివ్వాలి. ప్రభుత్వం చిన్నా, చితక పరిశ్రమలను ఏర్పాటు చేసి మహిళా ఎంటర్ ప్రెన్యూనర్లను పెంచాలి. సుదీర్ఘ ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి సీనియర్ల అనుభవాలు, అభిప్రాయాలను అవసరమైన చోట పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రగతిరథం అభివృద్ధి బాటలో సాఫీగా పరుగులు పెడ్తుంది.
– తుర్లపాటి లక్ష్మి, రచయిత్రి
దశాబ్ది ఉత్సవాలలో తెలంగాణ
1951- 1952లో నాన్ ముల్కీ గో బాక్‌తో మొదలైన తెలంగాణా ఉద్యమం ఢక్కామొక్కీలు తింటూ గుణపాఠాలు నేర్చుకుంది. ప్రజల ఉద్యమం భూమికగా 2014లో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణా ఆత్మగౌరవ పతాక రెపరెపలాడింది. ఇక్కడి రచయితల సాహితీ సృజనపై కమ్ముకున్న చీకట్లు పటాపంచలైనై. మిషన్ భగీరథతో ఆడబిడ్డల కష్టాలు గట్టెక్కినై. కోత లేని కరెంటు కంటివెలుగై నిరంతరంగా విద్యార్థులతో పాటు ప్రజలను కార్యోన్ముఖులను చేస్తున్నది. దళితబందు, రైతుబందు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం, కంటి వెలుగు, ఆసరా ఫించన్లు, బాలింతలకు కె.సి.ఆర్. కిట్టు, కల్యాణలక్ష్మి, వంటి పథకాలతో పాటు షీ టీంల ఏర్పాటు అన్నీ ప్రజోపయోగాలే. చెరువు పూడికల కార్యక్రమం గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఈ సంక్షేమ పథకాలన్నీ అంచెలంచెల వ్వవస్థలుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేవే. ఈ దొంతరల వారి వ్యవస్థలో ఈ పథకాలు ప్రజలకు సంపూర్ణంగా లబ్ది చేకూరడం లేదనే అపవాదు ఉంది. దీనిలో మధ్య దళారీల అనైతికత కొంత వరకు కారణమవుతోంది. మధ్య దళారీల పెత్తనం, అనైతికత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవలసి ఉంది. రైతుబంధు విషయానికి వస్తే సన్నకారు రైతులకు పరిమితం చేస్తే సార్థకత ఉండేది. ఇక్కడి సంస్కృతిని సాహిత్యాన్ని మరింత వికసింప చేయడానికి ఈ మట్టి మూలాలను దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణా ప్రజల లక్ష్యం నెరవేరుతుంది. ఏది ఏమైనా తెలంగాణా రాష్ట్ర అవతరణ ఈ ప్రాంత యాసను, భాషను, సంస్కృతిని, సాహిత్యాన్ని పునరుజ్జీవింప చేస్తూ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిందనేది నూటికి నూరు పాళ్ళ సత్యం. దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో లోటుపాట్లను సరిదిద్దుకుంటూ రాష్ట్రం మరింత ఆదర్శవంతంగా వెలుగొందాలని ఆశిస్తూ…
– డా|| తిరునగరి దేవకీ దేవి, తొలి మలిదశ ఉద్యమకారిణి
ప్రధాన భూమిక పోషించారు
ప్రపంచం గుర్తించిన పోరాటం తెలంగాణ ఉద్యమం. మహిళలు ఇందులో ప్రధాన భూమిక పోషించారు. ప్రతి మహిళ వారి వారి స్థాయిలో ఏం చేయగలరో అది రాష్ట్రం కోసం చేశారు. నిరక్షరాస్యులు కూడా దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఉద్యమంలో పాల్గొన్నారు. గొంతెత్తి నినదించారు. పురుషునికన్నా ఎక్కువగానే పోరాటంలో పాల్గొన్నారు. మగవారు ఏదో ఓ మేరకు పేరు, పదవుల కోసం పోరాటంలో పాల్గొని ఉండొచ్చు. కానీ మహిళలు మాత్రం ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ పోరాటమైన సంపూర్ణం కాలేదు. అలాగే తెలంగాణ ఉద్యమం కూడా. అలా అందరూ కోరుకున్నట్టు సాధించుకున్న తెలంగాణలో మహిళలకు సముచిత స్థానమే లభించింది. ముఖ్యంగా విద్య అవకాశాలు కొంత మేరకు పెరిగాయి. హాస్టల్ సౌకర్యాలు, ఫ్రీ బస్‌పాస్‌లు, శానిటరీ కిట్స్ లాంటివి ఇస్తున్నారు. దీని వల్ల పిల్లలు ధైర్యంగా బటయకు వచ్చి అలాగే కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత కొంత వరకు బాల్య వివాహాలు తగ్గాయలని చెప్పవచ్చు. ఎందుకంటే 18 ఏండ్లకు పెండ్లి చేస్తేనే అమ్మాయిలకు కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుంది. దాంతో పేదలు చాలా మంది అప్పటి వరకు పెండ్లి చేయకుండా ఆడపిల్లను చదివిస్తున్నారు. ఫలితంగా కనీసం ఇంటర్ అయినా పూర్తి చేయగలుగతున్నారు. దాంతో ఆలోచన శక్తి పెరిగి ఎక్కువమంది అమ్మాయిలు పెండ్లి తర్వాత కూడా చదువుకుంటూ ఉన్నత విద్య వరకు వెళుతున్నారు. ఇది నేను కింద స్థాయిలో గమనించి చెబుతున్న నిజం. అలాగే ఒంటరి, వృద్ధ మహిళలకు పెన్షన్లు ఇవ్వడం, గర్భిణీ మహిళలు సుఖంగా బిడ్డకు జన్మనిచ్చే వైద్య సదుపాయాలు కల్పించారు. మొత్తానికి గతం కంటే మార్పు ఉంది. అయితే జనాభా నిష్పత్తిలో, ఉత్పత్తిలో సగభాగంగా ఉన్న మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. అప్పుడు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యులు, ప్రభుత్వం కూడా ముందుకు రావాలి.
– సుమిత్రా ఆనంద్,
టీఎస్‌పీఎస్సీ బోర్డు సభ్యులు.