ఎంపీ టికెట్ ఆదివాసీకే కేటాయించాలి: ఆళ్ళపల్లి అధ్యక్షుడు పాయం రమేష్

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆదివాసీకే కేటాయించాలని ఆళ్ళపల్లి ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు పాయం రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా మూడు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ఒకే సామాజిక వర్గానికి చెందిన లంబాడా వారికి ఇవ్వడం ఆదివాసి సమాజాన్ని అణచివేయడమే అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆదివాసి అభ్యర్థి అయిన ఎట్టి వెంకన్నకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆదివాసి ఓట్లు చీలి టీఆర్ఎస్ లేదా బీజేపీ గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ములుగు, పినపాక, భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట అన్ని నియోజకవర్గాలలో ఆదివాసీల జనాభా సుమారు 5,71,215 మంది ఓటర్లను కలిగి ఉన్నామని ఈ సందర్భంగా విశ్లేషించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆదివాసి నలుగురు ఎమ్మెల్యేలను  భారీ మెజారిటీతో గెలుపొంది ఉన్నామని, ఈసారైనా మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఆదివాసి సామాజిక వర్గానికి చెందిన ఎట్టి వెంకన్నకు ఇచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.
Spread the love