నవతెలంగాణ – సుల్తాన్ బజార్
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐఎన్ టి యుసి 3194 రాష్ట్ర సంఘం తీవ్రంగా ఖండించింది. సోమవారం కోఠి లోని సంగం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్ మాట్లాడుతూ.. గుర్తింపు సంఘంగా అన్ని సంఘాల్లో యూనియన్ వెరిఫికేషన్ ఎన్నికల్లో గెలుపొంది నేటికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘంగా కొనసాగుతున్నది అన్నారు. గుర్తింపు సంఘం పేరుతో బదిలీలలో యూనియన్ ఆఫీస్ సభ్యులు పేరుతో 300 మందికి పత్రాలు ఇచ్చి డబ్బులు వసూలు చేసినట్టు వచ్చిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలని వారు ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సంఘానికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలంగాణ వైద్య ప్రజారోగ్య సంఘం అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఇటు సంఘాన్ని అటు ప్రభుత్వాన్ని బదనమ్ చేస్తున్నాడని అన్నారు. అతను గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ అనుబంధ సంఘంగా కొనసాగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ఐ ఎన్ టి యు సి ముసుగులో యూనియన్ స్థాపించి ఊసరవెల్లిలా రంగులు మారుతున్నాడని అన్నారు. గత పది ఏళ్లలో అతను టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలను బయటకు తీసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. ప్రభుత్వ సర్వీస్ నుండి రిటైర్మెంట్ పొంది మళ్లీ యూనియన్ల పేరుతో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాడని అన్నారు. ఎప్పటినుండో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఒక మంచి ఉద్దేశంతో బదిలీల జీవోను విడుదల చేసి బదిలీలు సజావుగా సాగేందుకు అధికారులు పాటుపడుతుంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని అధికారులను బదనాం చేసేందుకు సాయి రెడ్డి పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. తమ సంఘంపై చేసిన నిరాధారమైన ఆరోపణలు రుజువు చేయకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి భోగ ప్రకాష్ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ గోవిందరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామేశ్వరి, రామలక్ష్మి జ్ఞానేశ్వర్, దేవిక, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్, నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు నటరాజన్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గుండయ్య ఇతర రాష్ట్ర నాయకులు భూమన్న, బాబూలాల్ భాస్కర్ ఆంజనేయులు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు