కర్ణాటకలో మంత్రులకు శాఖల కేటాయింపు…

నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తోపాటు ఇతర మంత్రులందరికీ శాఖలను కేటాయించారు. మొత్తం 34 మంది మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. అందులో ముఖ్యమంత్రితోపాటు, ఉప ముఖ్యమంత్రి, 32 మంది ఇతర మంత్రులు ఉన్నారు. అయితే, సీఎం సిద్ధూ ఆర్థిక శాఖను మాత్రం తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. ఆర్థిక శాఖతోపాటు వ్యక్తిగత, పరిపాలనా సంస్కరణల శాఖ, ఇంటెలిజెన్స్‌ శాఖ, సమాచార శాఖ, ఎవరికీ కేటాయించని ఇతర చిన్నచిన్న శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖలను కేటాయించారు. దాంతోపాటు బెంగళూరు నగర అభివృద్ధి శాఖను కూడా డీకేకు కట్టబెట్టారు. ఇక సీనియర్‌ నేతలు జీ పరమేశ్వరకు హోంశాఖ (ఇంటెలిజెన్స్‌ మినహా), హెచ్‌కే పాటిల్‌కు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, దినేశ్‌ గుండూరావుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కృష్ణ బైరె గౌడకు రెవెన్యూ శాఖ, ఎన్‌ చలువనారాయణస్వామికి వ్యవసాయ శాఖ, కేజే జార్జ్‌కు విద్యుత్‌ శాఖ, కేహెచ్ మునియప్పకు ఆహార, పౌరసరఫరాల శాఖ, ఎంబీ పాటిల్‌కు పరిశ్రమల శాఖను, రామలింగప్ప రెడ్డికి రవాణా శాఖ, ప్రియాంక్‌ ఖర్గేకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ, బీ నాగేంద్రకు యువజన వ్యవహారాలు, క్రీడా శాఖలను కేటాయించారు.

Spread the love