– 14వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు
– ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడతలో 49,267 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ ఎస్కే మహమూద్, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, పాలమూరు వర్సిటీ వీసీ లక్ష్మికాంత్ రాథోడ్, మహిళా వర్సిటీ వీసీ విజ్జులత, కేయూ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, టీయూ రిజిస్ట్రార్ యాదగిరి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ జి యాదగిరి, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డి తిరువెంగళచారి రెండోవిడత సీట్లను కేటాయించారు. మూడో విడత షెడ్యూల్‌ను వారు విడుదల చేశారు. దోస్త్ రెండో విడతకు 53,184 మంది వెబ్ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. మొదటి ప్రాధాన్యత ద్వారా 35,195 మంది, రెండో ప్రాధాన్యత ద్వారా 14,072 మంది విద్యార్థులు సీట్లు పొందారని తెలిపారు. తక్కువ వెబ్ఆప్షన్లు నమోదు చేయడం వల్ల 3,917 మంది సీట్లు పొందలేకపోయారని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారిలో ఆర్ట్స్ 6,307 మంది, కామర్స్ (బీబీఏ కలిపి) 21,255 మంది, లైఫ్ సైన్సెస్ 11,944 మంది, ఫిజికల్ సైన్సెస్ 9,076 మంది, డేటా సైన్స్ 431 మంది, డీఫార్మసీ 203 మంది ఇతరులు 51 మంది కలిపి మొత్తం 49,267 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీటు పొందిన విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ శనివారం నుంచి ఈనెల 14 వరకు చేయాలని సూచించారు. మొదటి విడతలో సీటు పొంది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థుల రెండో విడతలో సీటు పొందితే మళ్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కోరారు. రెండోవిడతలో సీటు కేటాయిస్తే మొదటి విడతలోని సీటును కోల్పోతారని తెలిపారు. ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీటు కోల్పోతారని, దోస్త్ రిజిస్ట్రేషన్ రద్దవుతుందని పేర్కొన్నారు. మూడో విడత తర్వాతే ఈనెల 21 నుంచి 24 వరకు కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలని సూచించారు. శనివారం నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈనెల 14 వరకు గడువుందని పేర్కొన్నారు. శనివారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఈనెల 20న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఈనెల 24 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.