కలెక్టర్లకు సెలవు ప్రకటించే అవకాశమివ్వండి

– సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయనే కారణంగా విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా వర్షాలున్నాయనే సెలవులు ప్రకటించారని గురువారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. రాష్ట్రమంతటా వర్షం ఒకేరకంగా ఉండడం లేదని పేర్కొన్నారు. వర్షం లేని జిల్లాలు కూడా ఉంటున్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనపుడు ఆయా జిల్లాల కలెక్టర్లు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించే విధంగా అవకాశం కల్పించాలని సూచించారు. ఇది సముచితంగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన లేఖ రాశారు.
పాత వారినే గెస్ట్‌ లెక్చరర్లుగా తీసుకోవాలి
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గత విద్యాసంవత్సరంలో పనిచేసిన వారినే గెస్ట్‌ లెక్చరర్లుగా తీసుకోవాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరో ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు గురువారం ఆయన లేఖ రాశారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా గెస్ట్‌ లెక్చరర్ల తీసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ ఉత్తర్వులిచ్చారని తెలిపారు. కాలేజీలు జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యాయనీ, 50 రోజులు గడిచాయని పేర్కొన్నారు. ఈ సమయంలో మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేసి పోస్టులు భర్తీ చేయడానికి సమయం సరిపోదనీ, అది సరైన పద్ధతి కాదని విమర్శించారు. కాబట్టి గతేడాది పనిచేసిన గెస్ట్‌ లెక్చరర్లనే తిరిగి తీసుకోవాలనీ, అందుకు విద్యాశాఖకు తగు ఆదేశాలను జారీ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.

Spread the love