అల్లు అర్జున్‌ అరెస్ట్‌

అల్లు అర్జున్‌ అరెస్ట్‌– 14 రోజుల రిమాండ్‌ విధించిన నాంపల్లి కోర్టు
– హైకోర్టు మధ్యంతర బెయిల్‌ విడుదల ప్రక్రియ ఆలస్యం
– రాత్రికి చంచల్‌గూడ జైల్లోనే..!
– సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో..
నవతెలంగాణ-సిటీబ్యూరో/ముషీరాబాద్‌/దిల్‌సుఖ్‌నగర్‌
పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన కేసులో పాన్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 4న హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప-2 మూవీ ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం విదితమే. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో మృతురాలి భర్త భాస్కర్‌ ఫిర్యాదు మేరకు నటుడు అల్లు అర్జున్‌, సినిమా యూనిట్‌తో పాటు, సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో థియేటర్‌ యాజమాన్యంతోపాటు ఇద్దరు మేనేజర్లను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఏ11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, సినీప్రముఖులు, బంధుమిత్రులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌ నివాసంతోపాటు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌, నాంపల్లి, హైకోర్టు పరిసరాలల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఉదయం జూబ్లీహిల్స్‌లోని హీరో అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు 11:45గంటలకు అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అభిమానులు, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ రెడ్డి, తండ్రి అల్లు అరవింద్‌, పలువురు దర్శకులు స్టేషన్‌కు వచ్చారు. అల్లు అర్జున్‌పై 105, 118(1) రెడ్‌ విత్‌ 3/5 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చారు. తొక్కిసలాటకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదని, కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్‌ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనిపై పోలీసులు సైతం బలంగా వాదనలు వినిపించారు. ప్రిమియర్‌ షోకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, హీరో, హీరోయిన్‌ను రావద్దని థియేటర్‌ యజమానులకు లేఖ రాశామని, అయినా పోలీసుల అనుమతి లేకుండా దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీతో థియేటర్‌ దగ్గరకు వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. అల్లు అర్జున్‌ రావటం వల్లే ఒకరు చనిపోయారని, దీనికి కారణం అయనే అంటూ పోలీసుల తరపున వాదనలు వినిపించారు లాయర్లు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ తీర్పిచ్చింది. దాంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. దీనిపై అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేసింది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి చివరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకే వెళ్లాలని సూచించారు. కోర్టు ఉత్తర్వుల కాపీలను ఆయన తరపున లాయర్లు జైలు అధికారులకు అందజేయడం.. ఆన్‌లైన్‌ కావడంలో ఆలస్యం కావడం.. ప్రక్రియ పూర్తికానందున రాత్రి అయినా అల్లు అర్జున్‌ విడుదల కాలేదు. ఈ క్రమంలో జైలు వద్ద అభిమానులు పెద్దఎత్తున గుమికూడగా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం విడుదల కానున్నారని సమాచారం.
ఆయన రావడం వల్లే తొక్కిసలాట జరిగింది : సీపీ
అల్లు అర్జున్‌ థియేటర్‌కు రావడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగిందని నగర సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ నెల 4న సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రిమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన స్పందించారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
కేసు వాపస్‌ తీసుకుంటా : మృతురాలి భర్త
రేవతి మృతి కేసులో అల్లు అర్జున్‌ అరెస్టు కాగా ఆమె భర్త భాస్కర్‌ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ రోజు తన కుమారుడు శ్రీతేజ పుష్ప సినిమా చూడాలని పంతం చేయడంతో సంధ్య థియేటర్‌లో సినిమా చూడటానికి కుటుంబ సభ్యులం వెళ్లామని తెలిపారు. అల్లు అర్జున్‌ రావడంలో ఆయన తప్పేం లేదని.. తన భార్య మృతికి ఆయనకు సంబంధం లేదని అన్నారు. అల్లు అర్జున్‌ అరెస్టు విషయం కూడా ప్రసార మాధ్యమాల్లో చూసానని, పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. అవసరమైతే కేసు వాపస్‌ తీసుకుంటానన్నారు.

Spread the love