ఒంటరిగానే బరిలోకి…

Alone in the ring...– 24 స్థానాల్లో పోటీ
–  17 స్థానాల ప్రకటన
– ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత

– బీజేపీని ఓడించడమే మా లక్ష్యం
– సీపీఐ(ఎం)ను అసెంబ్లీకి పంపండి
– రెండు, మూడు రోజుల్లో మిగిలిన స్థానాలూ, అభ్యర్థుల ఎంపిక
– సీపీఐ పోటీ చేసే స్థానాల్లో మద్దతిస్తాం
– వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాట శక్తులను గెలిపించండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
– అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే విడిగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చామనీ, దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. 24 సీట్లకు పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయనీ, మొదటి విడతలో 17 స్థానాలను ప్రకటిస్తున్నామని వివరించారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన స్థానాలనూ, అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అవమానకరంగా పొత్తుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మిర్యాలగూడ, వైరా ఇస్తే కాంగ్రెస్‌తో పొత్తులో ఉంటామనీ, లేదంటే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ నాలుగు రోజుల కిందటే ప్రకటించామని చెప్పారు. కాంగ్రెస్‌ విజ్ఞప్తి మేరకు గురువారం మధ్యాహ్నం వరకు వారి నిర్ణయం కోసం ఎదురుచూశామని అన్నారు. వారు ఏమీ తేల్చని స్థితిలో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామని చెప్పారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్‌ అనుసరించిన అపసవ్యమైన విధానమే ఇందుకు కారణమన్నారు. అధికారంలోకి వచ్చాక వామపక్షాలకు చెరో ఎమ్మెల్సీ, మంత్రి పదవులిస్తామంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడు వ్యాఖ్యానించారని అన్నారు. ప్రధాని పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా వదిలేసిన చరిత్ర సీపీఐ(ఎం)కు ఉందన్నారు. పదవులే ముఖ్యమనుకుంటే జ్యోతిబసు ప్రధాని అయ్యే వారని చెప్పారు. కమ్యూనిస్టులు ఎలా కనిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టుల నిర్ణయాలకు ప్రాతిపదిక విధానాలే తప్ప పదవులు కాదన్నారు. కమ్యూనిస్టులకు విలువలు, విధానాలు, నైతికత ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్‌కు సద్బుద్ధి లేకపోవడం విచారకరమని విమర్శించారు. వామపక్ష శ్రేయోభిలాషులు, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
బీజేపీ ఒక్క సీటూ గెలవొద్దు
రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటునూ గెలవొద్దని తమ్మినేని అన్నారు. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో, ఎక్కడ బలంగా ఉందో నియోజకవర్గాల వారీగా అంచనా వేస్తామన్నారు. బీజేపీని ఓడించే పార్టీలను గెలిపించాలని కోరారు. తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించగలిగేది బీఆర్‌ఎస్‌ అయితే బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌ అయితే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ను గెలిపించాలనీ, సీపీఐ(ఎం)ను అసెంబ్లీకి పంపాలని కోరారు. అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండాలన్నారు. కమ్యూనిస్టుల్లేని శాసనసభ దేవుడు లేని దేవాలయం లాంటిదని అన్నారు. తాము పోటీ చేయనిచోట వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక, లౌకిక, పోరాట శక్తులను గెలిపించాలని చెప్పారు. ప్రజల పక్షపాతిగా ఉండేవారిని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్‌తో సీపీఐ తెగదెంపులు చేసుకుని వస్తే మంచిదన్నారు. ఒకవేళ వారికి కాంగ్రెస్‌తో పొత్తున్నా సీపీఐ పోటీ చేసే చోట తాము పోటీ చేయబోమనీ, సీపీఐకే మద్దతిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన 17 స్థానాల్లోనూ ఒకటి, రెండు మార్పులుండొచ్చని అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను ఓడించడం తమ లక్ష్యం కాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు తమ్మినేని సమాధానమిచ్చారు. మ్యానిఫెస్టో కమిటీ వేశామనీ, త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌, జాన్‌ వెస్లీ, మల్లు లక్ష్మి పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) పోటీ చేసే స్థానాలు నియోజకవర్గం
1. భద్రాచలం (ఎస్టీ)
2. అశ్వారవు పేట (ఎస్టీ)
3. పాలేరు
4. మధిర (ఎస్సీ)
5. వైరా (ఎస్టీ)
6. సత్తుపల్లి (ఎస్సీ)
7. ఖమ్మం
8. మిర్యాలగూడ
9. నల్లగొండ
10. నకిరేకల్‌ (ఎస్సీ)
11. భువనగిరి
12. హుజుర్‌నగర్‌
13. కోదాడ
14. జనగాం
15. ఇబ్రహీంపట్నం
16. పటాన్‌చెరు
17. ముషీరాబాద్‌

Spread the love