గిరిజనులతో పాటు గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలి

Along with the tribals, non-tribals should be given free passes– టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాలకు అనుమతులివ్వాలి
– అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు అనుమతులు ఇవ్వాలి
– గిరి వికాసం కింద చేపట్టిన బావులకు త్రీ పేస్ కరెంట్ ఇవ్వాలి
– రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో కోరిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్
నవతెలంగాణ – జన్నారం
అటవీ భూముల్లో సాగు చేసుకొంటున్న గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ భోజ్జు పటేల్ రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను కోరారు.శనివారం హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ పాల్గొని నియోజకవర్గంలో నెలకొని ఉన్న అటవీ శాఖ సమస్యలను మంత్రి కి వివరించారు.గిరిజనుల పోడు భూముల సమస్య ఇంకా పరిష్కారం కాలేదని,అనేక మంది గిరిజన రైతులకు పోడు పట్టాలు అందలేదని వివరించారు.  గిరిజనేతర రైతులు కూడ అటవీ భూముల్లో సాగులో ఉన్నారని వారికీ కూడ పోడు పట్టాలు ఇచ్చే విషయంలో సాధ్య సాధ్యలను పరిశీలించాలని కోరారు.  కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేదించారని దీంతో వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.భారీ వాహనాలను అనుమంతిచక పోవడంతో సరుకులు తరలింపులో వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.  ప్రజా అవసరాల దృష్ట్యా మంచిర్యాల నుంచి నిర్మల్ వరకు, ఉట్నూర్ నుంచి మంచిర్యాల వరకు భారీ వాహనాల ప్రవేశానికి ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కోరారు. అటవీ ప్రాంతంలో ఉన్న మిద్దె చింత, ధర్మాజీ పేట్, రాగి దుబ్బ గ్రామాలలో విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గుతున్నాయని,ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు ప్రయత్నిస్తే అటవీ శాఖ అధికారులు అడ్డుకొంటున్నారని,ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం అందే విధంగా అటవీ శాఖ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. గిరివికాసం పథకం కింద గిరిజన రైతులకు వ్యవసాయ బావులు అందించామని కానీ ఇంతవరకు త్రీ పేస్ కరెంట్ ఇవ్వకపోవడంతో వ్యవసాయ బావులు నిరూపయోగంగా మారాయని వ్యవసాయ బావుల్లో పుష్కళంగా నీరున్న కరెంట్ లేకపోవడంతో బావుల నీరు వ్యవసాయానికి మల్లించుకోలేక పోతున్నారని వారికి త్రిపేస్ కరెంట్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ జూమ్ మీటింగ్ లో పంచాయతీ రాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్ లు,అటవీ శాఖ ఉన్నతధికారులు పాల్గొన్నారు.
Spread the love