ఏది ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు. ఉండే కాడికి ఉంటేనే బాగుంటుంది. ఉన్నటువంటి పైసలు ఎక్కువ కనబడితే మనిషి అదోరకం అయిపోతడు. అందుకే ‘కూడు ఎక్కువైతే కువ్వారం ఎక్కువ – బట్ట ఎక్కువ అయితే ఆచారం ఎక్కువ’ అనే సామెత పుట్టింది. కూడు అంటే తినే ఆహారం కువ్వారం అంటే తెలిసినా తెలియనట్టు ఉండటం, పని వచ్చినా రానట్టు ముఖం పెట్టడం. ఇవన్నీ కూడు ఎక్కువైతే చేసే పనులు. దీని కొనసాగింపుగానే బట్ట ఎక్కువైతే ఆచారం ఎక్కువ అని పుట్టింది. ఆచారాలు వ్యవహారాలు అన్ని డబ్బు దస్కం ఉన్నోళ్లకే. ఏం లేని వాళ్ళకి ఏముండదు. కష్టం చేసుకుంటూ తినుడు. ‘కూడు ఉడికినంక పొయ్యి మండినట్టు – కులం చెడ్డంక బుద్ధి వచ్చినట్టు’ అనే సామెత కూడా ఉంది. నిజానికి అన్నం ఉడకాలంటే పొయ్యి మండాలి. కానీ ఎట్లనోఒకట్ల ఉడికినంక పొయ్యి మండితే ఏమి లాభం? కులం చెడినంక అంటే పొలం గాని పిల్లని పెళ్లి చేసుకోవడం అన్నట్టు. ఆ తర్వాత సంసారం అర్థమైతే జరిగే సంగతి!? ‘కూట్లే రాయి తీయని వాడు ఏట్ల రాయితీస్తాడా’ అంటే అన్నం తినే పల్లెములోని కూడులో చిన్న రాయి తీయలేని వాడు ప్రవహించే ఏరులో రాయి ఏమి తీస్తాడు అని అంటరు. ముందు చిన్న చిన్న పని, ఆ తర్వాత పెద్ద పని. మనిషి సంగతి తన పని ప్రవర్తన చెబుతుంది, వీడు గొప్పవాడా కాదా అనేది. ఇలాంటి వాళ్లే కొందరు ఉంటారు… ‘కూటికి గతి లేదు మీసాలకు సంపెంగ నూనె’ రాసుకుంటాడట అని అంటరు. ఇట్లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. ‘కూకుంటే లెవ్వరాదుగని ఎగిరి తాటికాయలు తంతాడంట’ అని మరొక సామెత. కూకునుడు అంటే కూర్చునుడు అని అర్థం. కూర్చొని ఉన్నాడు లేవడానికి కష్టపడే సోమరి అయితే లేచి అంతెత్తు తాటి చెట్టుపై తాటికాయలు ఎలా తన్నగలడు. అనే వ్యంగ్యములో పుట్టింది ఈ సామెత.
– అన్నవరం దేవేందర్, 9440763479