నవతెలంగాణ – పెద్దపల్లి : మరణంలోనూ పరోపకారం అనే నానుడిని నిజం చేశారు. పెద్దపల్లికి చెందిన గుంటి మొండయ్య అనే మాజీ సింగరేణి ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూరుకు చెందిన మొండయ్య బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. సుమారు 15 సంవత్సరాలకు పైగా కుటుంబానికి దూరంగా ఉంటున్న ఆయన పెద్దపల్లి భారత్ నగర్ కు చెందిన సురేందర్ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఇంట్లో ఉంటున్నాడు. అభ్యుదయ భావాలు కలిగిన మొండయ్య తన మరణం తర్వాత తన పార్ధీవదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వాలని సూచించాడు. ఈ నేపథ్యంలో బుధవారం అకాల మరణం చెందిన మొండయ్య మృతదేహాన్ని ఆయన భార్య స్వరూప, కుమారుడు అనిల్, కూతురు ఇందిరా, తమ్ముడు రాజవీరు, సోదరి సరోజన స్పందించి మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్, మగువ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని సిమ్స్ మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అప్పగించారు.