– క్లాస్ రూం, డైనింగ్ హాల్,డార్మేటరీ అన్నీ ఒకే చోట..
– అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పరిస్థితి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తల్లిదండ్రులు లేని అనాదలైన పిల్లలు చదువుకునే అవకాశానికి దూరం కాకూడదనే సదుద్దేశంతో ప్రభుత్వం 2017 సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని భువనగిరి లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను (URS) ప్రారంభించింది. తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యతగా, తల్లి లేదా తండ్రి లేనివారికి రెండవ ప్రాధాన్యతగా, పేద వారికి మూడవ ప్రాధాన్యతగా గుర్తించి పిల్లలను అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్చుకుంటారు. ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు సుమారు 100 మంది పిల్లలను బడిలో చేర్చుకొని వారికి వసతి, భోజనం, నాణ్యమైన విద్య ను అందించే అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రస్తుతం తాత్కాలిక అద్దె భవనంలో సమస్యలతో కొనసాగుతోంది. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలైనా స్వంత భవనం ఏర్పాటు చేయకపోవడం, పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్ధులు అరకొర సౌకర్యాలతో, ఇబ్బందులు పడుతూ విద్యను అభ్యసిస్తున్నారు. సరిపడా తరగతులు లేకున్నా , ఆడుకునే ఆటస్థలం లేకున్నా, తగినన్ని టాయిలెట్లు లేకున్నా, ఎవరికీ చెప్పుకోలేక, బిక్కు బిక్కు మంటూ విద్యా సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న కొద్దిపాటి ఖాలీ స్థలంలోనే ఉదయం ప్రేయర్ చేయడం, సాయంత్రం ఆ స్థలంలోనే ఆటలు ఆడుకోవడం, స్టడీ అవర్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. వర్షాకాలం లో ఉతికిన బట్టలు ఆర్ వేసుకోవడానికి స్థలం లేక గదుల్లోనే ఆరేసుకోవడం, భోజనం చేసి గది పక్కనే వాష్ రూంలు, స్నానపు గదులు ఉండడం వల్ల విద్యార్థులు వర్షా కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. కొందరు విద్యార్థులు వ్యాదులు నయంకాక ఇండ్లకు వెళుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతుంది. చదువులో వెనుకబడి పోతున్నారు. సమస్యల పద్మవ్యూహం లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు విముక్తి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
వెంటనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ కు ఫిర్యాదు
జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, భువనగిరి శాసనసభ్యులు వెంటనే భువనగిరి లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి, విద్యార్థుల సమస్యలు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తు ను దృష్టిలో ఉంచుకుని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను అన్ని వసతులు ఉన్న ఇతర భవనం లోనికి బదిలీ చేయాలని, తగిన నిధులు మంజూరు చేసి, నూతన భవనం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.