– 86 శాతం పెరిగిన బియ్యం ఎగుమతులు
– ఒక బిలియన్ డాలర్‌ను దాటిన వైనం
– రూ.8870 కోట్లకు పైనే..
– కేంద్రం సమాచారం
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగొచ్చన్న అంచనాల నడుమ భారత బియ్యం ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఈ పెరుగుదల 86 శాతంగా నమోదైంది. అలాగే, ఒక బిలియన్ డాలర్ మార్కును దాటింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ సమాచారం ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్‌లో బియ్యం ఎగుమతుల విలువ రూ.8874.81 కోట్లుగా ఉన్నది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.4776.98 కోట్లకు పైగా అంటే, ఈ సారి పెరుగుదల 85.79 శాతం కావటం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బియ్యం ఎగుమతుల విలువ దాదాపు 5,862.96 కోట్లుగా ఉన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 28న కేంద్రం నాన్-బాస్మతీ వైట్ రైస్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని టన్నుకు రూ.41,395గా విధించింది. ఆ తర్వాత అక్టోబర్ 23న ఈ పరిమితిని కూడా కేంద్రం తొలగించింది. సెప్టెంబర్ 27న, నాన్-బాస్మతి వైట్ రైస్‌పై 20 శాతం ఎగుమతి సుంకాన్ని కేంద్రం తీసేసింది. అలాగే, మూడు కేటగిరీల బియ్యంపై ఎగుమతి సుంకాన్ని సగానికి తగ్గించింది. ఆ తర్వాత అక్టోబర్ 22న సుంకాన్ని సున్నాకు చేసింది.
అక్టోబర్ నెలలో బియ్యం ఎగుమతుల్లో పెరుగుదలతో.. 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలలో ్ల(ఏప్రిల్-అక్టోబర్) మొత్తం బియ్యం ఎగుమతి.. 5.27 శాతం పెరుగుదలను చూసింది. మొత్తం ఎగుమతి విలువ దాదాపు రూ.52,130.96 కోట్లు.. గతేడాది ఇదే సమయంలో ఈ విలువ దాదాపు రూ.49,500.92 కోట్లుగా నమోదు కావటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత మొత్తం బియ్యం ఎగుమతుల విలువ రూ.44,734.31 కోట్లుగా ఉంటే.. అది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ.43,253.24 కోట్లకు పడిపోయింది. అంటే, ఈ తగ్గుదల 3.33 శాతం.
వరి ఉత్పత్తిలో భారత్, చైనాలది పైచేయి
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉన్నది. భారత్, చైనాలు కలిసి ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. బియ్యం విషయంలో చైనా అతిపెద్ద వినియోగదారు కాగా.. ఎగుమతుల్లో మాత్రం చిన్నదే. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్‌డీఏ) సమాచారం ప్రకారం.. గతేడాది ప్రపంచ మొత్తం బియ్యం ఎగుమతుల్లో భారత వాటా 33 శాతం (17 మిలియన్ టన్నులు)గా ఉన్నది. నాన్-బాస్మతి వైట్ రైస్ ఎగుమతులపై నిషేధానికి ముందు 2022లో ఇది 40 శాతంగా ఉన్నది. ప్రపంచ రైస్ మార్కెట్‌లో భారత్‌కు థారులాండ్, వియత్నాంలు ప్రధాన పోటీదారుగా ఉన్నాయి. గతేడాది వర్షాభావ పరిస్థితులు, వరి ఉత్పత్తిలో స్వల్ప తగ్గుదల వంటి కారణాలతో భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి ఉత్పత్తి రికార్డు స్థాయిలో 119.93 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా. ఇది గతేడాది (113.26 మిలియన్ టన్నులు) కంటే 6.67 మిలియన్ టన్నులు (5.89 శాతం) అధికం. దీంతో ప్రభుత్వం ఇప్పుడు బియ్యం ఎగుమతులకు మార్గం కల్పించింది.