ఏపీ రాజధానిగా అమరావతి

Amaravati is the capital of AP– ఎన్డీఏ శాసనసభాపక్షనేతగా చంద్రబాబు ఎన్నిక
– ప్రజాతీర్పుతో ఏపీకి పెరిగిన ప్రతిష్ట, గౌరవం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశంలో.. కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. మన రాజధాని అమరావతి అని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తానని, కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు.
ఏపీ గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమి నేతలు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష సమావేశం ముగిసిన అనంతరం వారు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్‌కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తమకు ఉన్నందున అందుకు ఆహ్వానించాలని ఈ సందర్భంగా వారు గవర్నర్‌ను కోరారు. ఆయనను కలిసిన వారిలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి పురందేశ్వరి ఉన్నారు.

Spread the love