ఇజ్రాయెల్‌కు రహస్యంగా మరిన్ని బాంబులను పంపుతున్న అమెరికా

– వాషిగ్టన్‌ పోస్టు
గాజా పట్టణం రఫాలో ఇజ్రాయెల్‌ చొరబాటు గురించి బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, బిలియన్‌ డాలర్ల విలువైన బాంబులు, విమానాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేసే ఆర్డర్‌పై అమెరికా సంతకం చేసిందని వాషింగ్‌టన్‌ పోస్ట్‌ శుక్రవారం రాసింది. దాదాపు 1,800 ఎమ్‌ కే 84 రకం 2,000-పౌండ్ల బాంబులు, 500 ఎమ్‌కే 82 రకం 500-పౌండ్ల బాంబులు ఇజ్రాయెల్‌కు అందనున్న ఆయుధాలలో ఉన్నాయని అనామక పెంటగాన్‌, వైట్‌ హౌస్‌ అధికారులు వాషింగ్‌టన్‌ పోస్టు పత్రికకు తెలిపారు. అంతేకాకుండా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ దాదాపు 2.5 బిలియన్ల విలువ గల 25 ఎఫ్‌, 35ఏ విమానాలను, ఇంజన్‌లను బదిలీ చేయడానికి అంగీకరించింది. అమెరికా అనుంగు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు అందించనున్న 3 బిలియన్‌ డాలర్లకు మించిన వార్షిక సైనిక సహాయంలో భాగంగా ఇది ఉంది.
పాలస్తీనా ఆరోగ్య అధికారులు అందించిన తాజా గణాంకాల ప్రకారం, గాజాలో మార్చి చివరి నాటికి ఇజ్రాయెల్‌ బాంబు దాడులలో సంభవించిన మరణాల సంఖ్య 32,000కు పెరగడానికి అమెరికా సరఫరా చేసిన బాంబులు కూడా ఒక కారణం. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ గత సంవత్సరం గాజాలోని జబాలియా శరణార్థి శిబిరం, అల్‌-షాతీ శరణార్థి శిబిరం చుట్టూ జరిపిన దాడులలో 2,000-పౌండ్ల బంకర్‌ బస్టర్‌ బాంబులను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్క జబాలియా బాంబు దాడులలోనే 100 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడులను ఐక్యరాజ్య సమితి ”యుద్ధ నేరాలకు సమానమైన అసమాన దాడులు” అని పిలిచింది.

Spread the love