పాలస్తీనాలో యుద్ధ నేరాలు కప్పిపుచ్చుతున్న అమెరికా మీడియా

న్యూయార్క్‌ : వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌, ఇతరచోట్ల ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న యుద్ధ నేరాలను మానవ హక్కులకు చెందిన ఐక్యరాజ్య సమితి కమిటీ ఖండించింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ముగ్గురు సభ్యుల గ్రూపు ఇజ్రాయిలీ సైన్యం చేస్తున్న హత్యలను, ప్రజలను గాయపర్చటాన్ని, వారి గృహాలను, ఇతర మౌలిక వసతులను ధ్వంసం చేయటాన్ని, వేలాది ప్రజలను నిర్బంధంగా కాందిశీకులుగా మార్చటాన్ని ఎత్తిచూపింది. జెనిన్‌ బయట 14,000మందితో నిర్వహించబడుతున్న ఓ కాందిశీకుల తాత్కాలిక క్యాంపుపైన ఇజ్రాయిలీ సైన్యం చేసిన దాడిలో 12 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. 100మందికి పైగా గాయపడ్డారు. క్యాంపులో నివసిస్తున్నవారిలో నాలుగో వంతు మంది భయంతో పారిపోయారు. ఆ క్యాంపులోగల నీటి వసతి, కరెంటు, ఆరోగ్య సేవా కేంద్రాలను ఇజ్రాయిలీ సైన్యం ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసింది. వెయ్యిమంది ఇజ్రాయిలీ కమాండోలు చేసిన ఈ విధ్వంసాన్ని జర్నలిస్టులతో సహా అనేకమంది ప్రత్యక్షంగా చూశారు. 2002లో వెస్ట్‌ బ్యాంకులోని జెనిన్‌ క్యాంపును నాశనం చేసిన తరువాత జరిగిన దాడులలో ఇదే అతిపెద్ద కిరాతక దాడి అని ఐక్యరాజ్య సమితి గ్రూపు పేర్కొంది. ఈ దాడిలో గత రెండు దశాబ్దాల్లో వాయుసేన పాల్గొనటం ఇదే తొలిసారి. ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను నాశనం చేయటమే లక్ష్యంగా ఈ దాడి సాగింది. గాయపడిన వారిని తరలించటానికి అంబులెన్సులను కూడా అనుమతించలేదని, జెనిన్‌ జనరల్‌ ఆస్పత్రి దగ్గర ఇజ్రాయిలీ సైన్యం భాష్ప వాయువును ప్రయోగించిందని కూడా మీడియా పేర్కొంది.
యావత్‌ పాలస్తీనా ప్రజానీకాన్ని తన భద్రతకు ప్రమాదంగా ఇజ్రాయిల్‌ భావిస్తోందని ఐక్యరాజ్య సమితి గ్రూపు తెలిపింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఆక్రమిత ప్రాంతంలో పాలస్తీనీయులకు రక్షణ ఉంటుంది. మానవ హక్కులుంటాయి. ఒక దురాక్రమణదారు తన ఆక్రమిత ప్రాంతంలోని ప్రజలను తన భద్రతకు సమిష్టి ప్రమాదంగా భావించకూడదని కూడా ఆ గ్రూపు పేర్కొంది.
అయితే అమెరికా మీడియాలో జెనిన్‌లోని వాస్తవ పరిస్థితుల గురించిగానీ, ఐక్యరాజ్య సమితి గ్రూపు గుర్తించిన వాస్తవాల ప్రస్తావనగానీ లేనేలేదు. పాలస్తీనా ప్రజల న్యాయమైన హక్కులను కాలరాస్తున్న ఇజ్రాయిలీ చర్యలను ”టెర్రరిస్టు వ్యతిరేక” చర్యలుగా అమెరికా మీడియా చిత్రిస్తోంది. పాలస్తీనాలో అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరుగుతున్నదని ఐక్యరాజ్య సమితి గ్రూపు చెప్పిన విషయం గురించి వాషింగ్టన్‌ పోస్ట్‌ ఒకే ఒక వ్యాక్యం రాసింది. న్యూయార్క్‌ టైమ్స్‌ ఏమీ రాయలేదు. అమెరికాలోని టెలివిజన్‌ నెట్‌వర్క్‌లన్నీ మౌనంగా ఉన్నాయి. ఇదంతా అమెరికా ప్రభుత్వ మద్దతుతోనే జరుగుతున్నదన్నది జగద్వితం.
ఒకవైపు పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయిల్‌ చేస్తున్న క్రూర అణచివేతను విస్మరిస్తూ మరోవైపు ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం యుద్ధ నేరాలకు పాల్పడుతున్నదని అమెరికన్‌ మీడియా ఒక సంవత్సరంపైగా ఊదరగొడుతున్నది. జెనిన్‌లో ఇజ్రాయిల్‌ చేస్తున్న దుర్మార్గాలపైన న్యూయర్క్‌ టైమ్స్‌ గానీ, వాషింగ్టన్‌ పోస్టు గానీ ఒక్క సంపాదకీయం కూడా రాయలేదు. జెనిన్‌లో ఇజ్రాయిల్‌ దాడి జరగటానికి ఒక రోజు ముందు ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధ నేరాలకు రష్యా బాధ్యతవహించాలని వాషింగ్టన్‌ పోస్టు పతాక శీర్షిక పెట్టింది. అదే పాలస్తీనా విషయానికి వచ్చినప్పుడు ఇజ్రాయిలీ హింసాకాండ పైన ఎన్ని సాక్షాధారాలున్నప్పటికీ అమెరికా మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఇలా అమెరికన్‌ మీడియా పాటిస్తున్న ద్వంద ప్రమాణాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి

Spread the love