ఐరోపాపై ముగిసిన అమెరికా భౌగోళిక రాజకీయ నియంత్రణ

Ended on Europe America's geopolitical control– పోలిష్‌ ప్రధాని
అమెరికాకు తమ భద్రతను ‘ఔట్‌సోర్సింగ్‌’ చేసే యూరోపియన్‌ దేశాల యుగం ముగిసిందని పోలిష్‌ ప్రధాన మంత్రి డొనాల్డ్‌ టస్క్‌ హెచ్చరించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ కమలా హారిస్‌ లేదా ఆమె రిపబ్లికన్‌ ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లలో ఎవరు గెలుస్తారన్నది ముఖ్యం కాదని ఆయన అన్నాడు. 2014 నుంచి 2019 వరకు యూరోపియన్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన టస్క్‌ అమెరికాలో నవంబర్‌ 5న ఓటింగ్‌ జరగడానికి కొద్ది రోజుల ముందు శనివారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.
”హారిస్‌ లేదా ట్రంప్‌? యూరప్‌ భవిష్యత్తు అమెరికా ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని కొందరు పేర్కొంటారు. అయితే అది మొదటగా మనపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన రాశాడు. కానీ యూరోపియన్‌ యూనియన్‌ ”తనకు తానుగా ఎదిగి, తన స్వంత బలాన్ని విశ్వసించినప్పుడు మాత్రమే విషయాలను తన చేతుల్లోకి తీసుకోగలుగుతుంది” అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పాడు. ”అమెరికాలో ఎన్నికల ఫలితం ఏమైనప్పటికీ, ఐరోపాలో భౌగోళిక రాజకీయ అవుట్‌సోర్సింగ్‌ యుగం ముగిసింది” అని టస్క్‌ ప్రకటించాడు.
ఫైనాన్షియల్‌ టైమ్స్‌ శనివారం ఒక కథనంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల్లో గెలుపొందడం, అణు గొడుగు రూపంలో వ్యక్తీకరించబడిన రక్షణను నాటోకు, దాని మిత్రదేశాలకు అమెరికా ఇస్తున్న భద్రతా హామీలను విస్మరించడంపై చాలా మంది యూరోపియన్లు రాత్రి నిద్రను కోల్పోతారు అని రాసింది. ”ఉక్రెయిన్‌ యూరోపియన్‌ మద్దతుదారులు కూడా ట్రంప్‌ ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చని ఆందోళన చెందుతున్నారు. అది వ్లాదిమిర్‌ పుతిన్‌ రష్యాకు విజయాన్ని చేకూరుస్తుంది” అని ఆ వ్యాసం పేర్కొంది.
ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకారం, చాలా మంది యూరోపియన్లు హారిస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే ”మరింత సుఖంగా ఉంటారు”. ప్రచారం సమయంలో, డెమోక్రాటిక్‌ అభ్యర్థి నాటోకు బలమైన మద్దతును వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. అమెరికా పొత్తుల ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. గత నెలలో స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, పోలాండ్‌లలో సావంత పరిశోధనా సంస్థ నిర్వహించిన పోల్‌లో హారిస్‌ ప్రెసిడెన్సీ ‘యూరోపియన్‌ భద్రతకు ఉత్తమమైనది’ అని ఆ దేశాల్లోని చాలా మంది ప్రజలు విశ్వసించారు. సర్వే చేసిన ఆరు దేశాల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థిపై నమ్మకం స్థాయి స్పెయిన్‌లో అత్యధికంగా70 శాతంగాను, పోలాండ్‌లో అత్యల్పంగా 58 శాతం గాను ఉంది.
ఈ వారం ప్రారంభంలో యురోపియన్‌ పార్లమెంట్‌ ఫారిన్‌ అఫైర్స్‌ కమిటీ అధిపతి డేవిడ్‌ మెక్‌అలిస్టర్‌ డ్యుయిష్‌ వెల్లేతో మాట్లాడుతూ, అమెరికాలో ఓటుకు సంబంధించిన రెండు ఫలితాలకు కూటమి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ”స్వరం భిన్నంగా ఉంటుంది కానీ మా స్వంత భద్రత, రక్షణ కోసం యూరోపియన్లు మరింత చేయమని హారిస్‌ పరిపాలన కూడా పిలుపునిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని మెక్‌అలిస్టర్‌ చెప్పాడు.

Spread the love