అమిత్‌ షా వచ్చింది దోచుకోవడానికే..

Amit Shah came to rob..– ఒక్క హామీ అమలు చేయలేదు
– బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ
– ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా..: మహిళాశక్తి పథకం ప్రారంభ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షా దోచుకునేందుకే ఇక్కడకు వచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆయన మహిళాశక్తి పథకాన్ని ప్రారంభించారు. మహిళా శక్తి పాలసీ డాక్యుమెంట్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండించిన పంటలను కొన్నారా? అని అడిగారు. రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామనీ హామీ ఇచ్చి, అది అమలు చేయకపోగా ఢిల్లీలో నిలదీసిన రైతులపై కాల్పులు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలతో అదానీ, అంబానీలకు మేలు చేసే చర్యలే తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అందరికీ ఇండ్లు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ మోసం చేసిందనీ, పేదలు ఇంకా గుడిసెల్లోనే బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్‌ బ్యాంకు నుంచి నల్ల డబ్బును వెనక్కి తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామంటూ ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చలేదని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ మేరకు పదేండ్లలో 22 కోట్ల మందికి ఉద్యోగాలివ్వాల్సిందనీ, అలా ఇచ్చి ఉంటే తెలంగాణలో 70 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. పార్లమెంటు తలపులను మూసి తెలంగాణ ఇచ్చారంటూ రాష్ట్ర ప్రజలను మోడీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ లది ఎప్పుడూ చీకటి ఒప్పందమేనని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ఒక పార్టీ తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తే, వాటిని కాదని మరో పార్టీ నాలుగు స్థానాల్లో ప్రకటిస్తున్నాయని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్‌ వైపు చూస్తే అలాంటి వారి గుడ్లు పీకీ గోలీలు ఆడుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
మహిళా నాయకత్వంలో కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ పార్టీ ఒక మహిళా నాయకత్వంలో పని చేస్తున్నదని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీ, ఆరు గ్యారంటీలను ఇచ్చి అమలు చేస్తున్నారని చెప్పారు. కట్టెలపొయ్యిపై వంటలతో మహిళలు పడే బాధను చూడలేక యూపీఏ హయాంలోనే రూ.400కే గ్యాస్‌ను అందించారని తెలిపారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ…ఇలా కాంగ్రెస్‌ అంటేనే మహిళాశక్తితో నిండి ఉందని తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు ఆడబిడ్డల ఉసురు
బీఆర్‌ఎస్‌ పార్టీకి మహిళల ఉసురుతాకిందని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆడబిడ్డల కంట కన్నీరు మంచిది కాదనీ పెద్దలు చెబుతారనీ, వారిని ఏడిపించిన కేసీఆర్‌ను బండకేసి కొట్టారని తెలిపారు. మళ్లీ ఓట్ల కోసం వస్తే చేతులకు రొట్టెలు చేసే కర్రతో వాతలు పెట్టాలని సూచించారు. పదేండ్ల కేసీఆర్‌ పాలనలో మహిళా సంఘాలను దివాళా తీయించారనీ, వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే తమ పార్టీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కవరేజీ రూ.10 లక్షల పెంపుతో పాటు ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నదని వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను కూడా ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌ ప్రజలకు నచ్చేలా పాలన చేస్తుంటే తమ ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్‌ కుటుంబం ఫామ్‌ హౌస్‌లో చిందులు వేస్తోందని రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో దొరలే కూర్చోవాలా? రైతు బిడ్డ కూర్చో కూడదా? కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్‌, మోదీ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మీరు ఓట్లేసి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 93 లక్షల మంది ఓట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందనీ, తాను ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్‌ గుర్తుచేశారు. అయ్య పేరు మీదనో, మరొకరి పేరు మీదనో కాలేదని స్పష్టం చేశారు.
ఐదేండ్లలో కోటీశ్వరులుగా కోటి మంది మహిళలు
రాబోయే ఐదేండ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం స్వయం సహాయక మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులుగా ఉన్న వారి సంఖ్యను కోటికి పెంచాలని సూచించారు. నెల రోజుల్లో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామం పక్కన మహిళా సంఘాలకు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో 10 లక్షల మంది మహిళలతో కవాతు చేస్తామనీ, తమ సైన్యం, బలగం మహిళలేనని ఆయన నొక్కి చెప్పారు.
ఇబ్బందులున్నా …కోటి రుణం ఇస్తాం : మల్లు భట్టి విక్రమార్క
ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే… ప్రతి సంఘానికి రూ.ఒక కోటి రుణం ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఐదేండ్లలో సంఘాలకు రూ.ఒక లక్ష కోట్ల రుణాలిస్తామనీ, దాని వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రుణబీమా సౌకర్యం కల్పిస్తుండటంతో ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ, మహిళల కోసం తమ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను వివరించారు.

Spread the love