అమిత్‌ షా గో బ్యాక్‌

– తొమ్మిదేండ్ల విద్రోహ పాలనపై వామపక్షాల నిరసనలు
– ఏపీకి ద్రోహం చేసిన బీజేపీకి పాడెకట్టండి : సీపీఐ(ఎం)ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు
– దేశానికి, రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదు : సీపీఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ
విశాఖ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాకను నిరసిస్తూ రాష్ట్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్వాన ఆదివారం ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ‘అమిత్‌ షా గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని, పైగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిందని ఏపీలోని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విధాలా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందిగాక విజయోత్సవ సభల పేరుతో మరోమారు మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి రాష్ట్ర ప్రజలు పాడెకట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ తొమ్మిదేండ్ల విద్రోహ పాలనపై సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఏపీశాఖల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలో రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం జంక్షన్‌ నుంచి ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపాన ఉన్న గురజాడ విగ్రహం వరకు నల్లజెండాలు, నల్లదుస్తులతో నిరసన ర్యాలీ జరిగింది. గురజాడ విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ‘అమిత్‌ షా గో బ్యాక్‌’ ‘స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిన వారికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు అధ్యక్షతన సభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, దేశంలో యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ అధికారంలోకి ఇచ్చిన బీజేపీ తొమ్మిదేండ్ల పాలనంతా విద్వేష, విద్రోహపూరితంగా సాగిందని విమర్శించారు. సుజల స్రవంతికి, వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి నిధులు, రైల్వే జోన్‌ వంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను విక్రయిస్తున్న బీజేపీ చెందిన నేత అమిత్‌ షాకు విశాఖలో అడుగుపెట్టే నైతిక అర్హత లేదని తెలిపారు. పోలవరం నిర్వాసితులను గోదాట్లో ముంచేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించుకుందని విమర్శించారు. సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్నారు. అటవీ చట్టాలను తుంగలో తొక్కి గిరిజనులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, సీపీఐ (ఎంఎల్‌)ఏపీ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.లక్ష్మి, ఆప్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ సీతల్‌ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జరిగిన ధర్నాలో సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ తొమ్మిదేండ్ల పాలనలో దేశానికి, దేశానికి చేసిన మేలు ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలిపారు.

 

Spread the love