అమ్మ.. తొలి అక్షరంతో పెదవి విచ్చుకుంటే.. మలి అక్షరంతో పెదవులు కలిసిపోతాయి.. మధ్యలో ఉన్న సమస్త సష్టి రహస్యమే అమ్మ… అమ్మ అనే ఈ రెండక్షరాలు.. అనురాగ చిహ్నాలు, ఆత్మీయతకు సంకేతాలు… పదాలు తెలియని పెదవులకు అమత వాక్యమే అమ్మ. త్యాగం, ప్రేమా కలిస్తే అందులో నుంచి అమ్మ అనే రెండక్షరాల పదం పుట్టుకు వచ్చింది. ఈ పదం కన్నా గొప్పది ఈ ప్రపంచంలో మరోటి లేదనే చెప్పవచ్చు. అమ్మ అంటే ఒక్క పదంలోనో… ఒక్క వాక్యం లోనో… ఒక్క పాటలోనో… ఒక్క వ్యాసం, ప్రసంగంలోనో చెప్పేది కాదు. అమ్మంటే జీవితం. నేడు మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ గొప్పతనం గురించి…
ఓ జీవికి ప్రాణం పోయడానికి సరికొత్తగా అవతరిస్తుంది. అమ్మ గర్భధారణకు అనువుగా శరీరాన్ని సిద్దం చేసుకుంటుంది. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి బిడ్డకు జీవం పోస్తుంది. అమ్మదనమంటే బిడ్డకు జన్మ, తల్లికి పునర్జన్మ. తన గర్భంలో ప్రతిరూపం పడ్డ క్షణం నుంచి నవమాసాలు మోసి, ఎన్నో నొప్పులను పంటి బిగువున భరించి జన్మనిస్తుంది. ఆ బిడ్డ బయటకు వచ్చే వరకు ఎన్నో కలలు కంటుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరచిపోతుంది. ఏ శరీరమైనా మహా అయితే నలభై అయిదు (డెల్) యూనిట్ల నొప్పిని భరించగలదు. కాబోయే తల్లి యాభై ఏడు (డెల్) యూనిట్ల పురిటినొప్పిని తట్టుకుంటుంది. అంటే ఒంట్లోని ఇరవై ఎముకలు ఒకేసారి ఫెళఫెళమని విరిగిపోతున్నంత బాధ. అంతటి నొప్పిని కూడా ఓ అనుభూతిగానే భావిస్తుంది అమ్మ. ప్రసవ సమయంలో అమ్మ పడే ఈ కాన్పు కష్టాన్ని రైలు పట్టాల మీద నలిగే నాణెంతో పోల్చారు ఓ కవయిత్రి.
జన్మ ఇవ్వడమే కాదు బిడ్డకు తొలి గురువుగా అమ్మ ప్రధాన భూమిక వహిస్తుంది. గర్భస్థ శిశువుగా ఉన్నప్పటినుంచీ బిడ్డ అమ్మ ఆలోచనలను, భావాలను, భాషను ఆకళింపు చేసుకుని అమ్మ కడుపులోనే అక్షరాభ్యాసం చేస్తాడు. అలాగే పిల్లలకు బుడిబుడి అడుగులు వేయించడంతోనే తన బాధ్యత తీరిపోతుందని అనుకోదు. బడి పాఠాలు నేర్వక ముందే తల్లి ఒడినే బడిగా, గుడిగా చేసుకుని తొలి పాఠాలు నేర్పుతూ వారి భావిజీవితానికి బంగారుబాట వేస్తుంది. బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తుంది. ఈవిధంగా అమ్మ బిడ్డకు తొలి గురువైంది. ఆమె అందించే నిస్వార్థ ప్రేమే మనిషిని సమాజంలో ఆదర్శప్రాయునిగా నిలబెడుతుంది. చరిత్రలో మహాత్ములుగా, మహనీయులుగా పేరుతెచ్చుకున్నవారంతా తల్లి ఒడిలో తొలిపాఠాలు నేర్చుకున్నవారే. ఉగ్గుపాలు పట్టించడమేకాదు ఉన్నతస్థానంలో నిలబెట్టేందుకు అహరహరం శ్రమిస్తుంది. అందుకే అమ్మతో సమానమైన వారు ఎవరూ లేరు అంటారు. ఈ ప్రపంచంలో అమ్మ ఎవరి స్థానాన్ని అయినా భర్తీ చెయ్యగలదు. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చెయ్యడం సాధ్యం కానే కాదు.
స్వచ్ఛతకు మరో రూపం
ఈ ప్రపంచంలో ఏ బంధంలోనైనా స్వార్ధం, స్వలాభం ఉంటాయేమో కానీ అమ్మ ప్రేమ మాత్రం స్వచ్ఛతకు మరో రూపం. ప్రత్యక్షంగా కన్పించే దైవ స్వరూపం. లోకంలో స్వార్థం లేని వారంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క అమ్మ మాత్రమే. ఓ సినీ కవి చెప్పినట్లు దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేడనే వాడు అసలే లేడు. ఇది అక్షర సత్యం. పది మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, వంద మంది ఆచార్యుల కన్నా ఒక తండ్రి, అలాంటి వెయ్యి మంది తండ్రుల కన్నా తల్లి మిన్న అంటారు. బిడ్డ ఈ లోకాన్ని తొలుత అమ్మ కళ్లతోనే అవగాహన చేసుకుంటుంది. బిడ్డ తొలి పలుకులకు అమ్మ ఆచార్యత్వం వహిస్తుంది.
అమ్మ మార్గదర్శి
అమ్మ ఏ డిగ్రీలు చదవక పోయినా జీవిత సత్యాలను సామెతల రూపంలో, చిన్న చిన్న కథలు రూపంలో ఆకట్టుకునే విధంగా చెప్పగలదు. అవి మన మనసున హత్తుకుని జీవితాంతం మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మన నడవడికలో ఎప్పటికప్పుడు అవి పురోగమన ప్రయాణానికి దోహదపడతాయి. ఎందుకంటే అమ్మ చెప్పే అన్నింటిలో లాలన, ప్రేమ మిళితమై ఉంటుంది. అందుకే మన మనసున చెరగని ముద్ర పడుతుంది. తన సంతానానికి ఎప్పటికి ఏది అవసరమో గుర్తించి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, వాళ్ళు ఓటమి చెందినపుడు ఓదార్పుని, నిరాశ నిస్పృహలు చుట్టుముట్టినపుడు అశావాదాన్ని ఇలా ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ బిడ్డలను కాపాడుకోగలిగేది అమ్మ మాత్రమే.
బిడ్డకు కంచు కవచం
అమ్మ ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా సలహాలిస్తుంది. కష్టం ఎదురైనప్పుడు ఆమె అందించే ఓదార్పు, తీయనైన మాటలు.. మానసిక నిపుణులకు కూడా తెలియదేమో అనిపిస్తుంది. నాన్నకు, బిడ్డకు మధ్య అమ్మ రాయబారి. పిల్లలకు ఏది కావాలన్నా ముందుగా అమ్మ దగ్గరికే పరుగులు పెడతారు. కబుర్లు పంచుకోవాలన్నా, బాధలు పంచుకోవాలన్నా, సలహాలివ్వాలన్నా అమ్మకు మించిన స్నేహితురాలు వేరొకరు దొరకరు. ఏ విధంగా చుసినా అమ్మే బిడ్డకు కంచు కవచం. అందుకే అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ అంటే ఓ అనుభూతి.. ఓ అనుబంధం.. ఓ ఆప్యాయత.. ఓ ఆత్మీయత..
ఆర్థిక క్రమశిక్షణ
ఆదాయమెంత? అవసరాలేంటి అని బేరీజు వేసుకుంటూ, ప్రతి పైసానూ సక్రమంగా వినియోగించుకుంటూ, అందులోనే కొంత క్రమం తప్పకుండా పొదుపు చేసుకుంటూ, భవిష్యత్తును సురక్షితంగా మలచుకోవడం, అమ్మ నుంచి అలవర్చుకున్నవే. జాగ్రత్త, పొదుపు అనేవి ప్రతి బిడ్డ అమ్మ దగ్గర నుంచి నేర్చుకోగలిగే సహజ విద్యలు. విద్యాలయాల్లో నేర్వని ఈ నైపుణ్యాలు అమ్మ ద్వారా గ్రహించి ఉన్నత స్ధానంలో నిలచిన బిడ్డలు ఎందరో.
అమ్మ సంగీత కళానిధి
సంగీత, సాహిత్య పరంగా, మాధుర్యంలోనూ అమ్మ లాలి పాటకు మించింది ఏముంది? ఏ సంగీత విద్వాంసుడు అమ్మలా పాడి నిద్ర పుచ్చగలడు? అందుకే అమ్మ సంగీత కళానిధి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. అమ్మతో మంచి అనుబంధం ఉన్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదుగుతుందని వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. మెదడులో వుండే హిప్నోకాంపస్ అనే భాగం మన జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకూ, ఒత్తిడిని తట్టుకునే శక్తికీ ఆధారభూతమైంది. అమ్మ ప్రేమ లభించేవారిలో అది దాదాపు పదిశాతం పెద్దదిగా ఉన్నట్లు తేలింది.
అమృతం కన్నా అమ్మే మిన్న
పురాణ ఇతిహాసాల్లో అమృతాన్ని చాలా గొప్పగా చెబుతారు. అయితే ఆ అమతం ఎలా ఉంటుందో మనకెవరికీ తెలియదు. అమ్మ ప్రేమ ముందు ఎంతో గొప్పగా చెప్పుకునే అమృతం కూడా దిగదుడుపే. ఎందుకంటే అమ్మ ప్రేమలో ఉన్న మాధుర్యం అటువంటిది. తన ప్రేమ ద్వారా ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. యుగాలతో సంబంధం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను అందించడం అమ్మకు మాత్రమే సాధ్యం. ఈ సృష్టిలో ఎవరికైనా జీవితాంతం వెంటాడే ఒక భావోద్వేగం అమ్మ. తాను లేనిదే ఎవరూ లేరు. అమ్మ ఉన్నప్పుడు ఎన్ని లేకపోయినా, అమ్మ ఉంది అదే పెద్ద ధైర్యం. మరి, అమ్మే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏమీ లేని దైన్యం. అమ్మ ఉన్నప్పటి కన్నా లేనప్పుడు ఎవరికి వారికి అనుభవమిది.
అమ్మ ప్రేమకు కొలమానం లేదు
నాన్న ప్రేమలో షరతులు ఉండొచ్చు, కొడుకు ప్రేమలో స్వార్థం ఉండొచ్చు, కూతురి ప్రేమలో పరిమితులు ఉండొచ్చు. అదే అమ్మయితే హిమాలయమంత ప్రేమ, సముద్రమంత ప్రేమ, ఆకాశమంత ప్రేమ! అనంతమంత ప్రేమ! అమ్మ శ్రద్ధకు హద్దు ల్లేవు. అమ్మ అనురాగానికి కొలతల్లేవు. అమ్మంటే కొలతలకు అందని కారుణ్యం. అందుకే ‘అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరి తూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు’ అన్నారు ప్రఖ్యాత కవి సి.నారాయణరెడ్డి.
అతిపెద్ద విశ్వవిద్యాలయం
కటిక పేదరికంలోనూ కూలి పనితో బిడల కడుపునింపే అమ్మలెందరో ఉన్నారు. తన ఆరోగ్యం కుంటుపడినా.. పిల్లల ఆరోగ్యం కోసం పరితపించే మాతృమూర్తులయితే లెక్కేలేదు. మనం ఆమె నమ్మకాన్ని వమ్ముచేసినా ఆమె మనపై నమ్మకాన్ని మాత్రం వదులుకోదు. ఊయల ఊపే చేతులకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతూ ఉంది. తల్లి హృదయమే మానవాళిని నడిపించే అతిపెద్ద విశ్వవిద్యాలయం. ‘భవిష్యత్తు గురించి సరిగ్గా చెప్పగలిగిందే అమ్మే. ఎందుకంటే మానవాళి భవిష్యత్తుకు అమ్మే మూలం కాబట్టి’ అంటాడు మాక్సిమ్ గోర్కీ.
చెల్లించలేనంత రుణం ఆమెది
ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. ‘నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను’ అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్. అన్ని మతాలు కూడా మాతృమూర్తికే తొలి వందనం అర్పించాలని ప్రవచించాయి. ప్రేమ, దయ, కరుణ, త్యాగాలలో మాతమూర్తికి సాటి మరి ఎవరూ లేరని విశదీకరించాయి. ప్రపంచంలో తీర్చుకోలేని రుణమంటూ ఉంటే అది ఒక్క అమ్మ రుణమే అంటారు. అమ్మ శ్రమను కొలిచినా, ఆ స్వేద బిందువులను లెక్కగట్టినా చెల్లించలేనంత రుణం ఆమెది. తన రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే తల్లి రుణం ఎన్నటికీ తీర్చలేం. అమ్మ అందించిన ప్రేమ తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం.
అమ్మను బాధపెట్టకూడదు
ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మ ప్రేమ మారదు. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా.. నిన్ను ప్రేమించే వాళ్లు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. ధనం లేని వాడు బీదవాడు కాదు.. అమ్మ ప్రేమ లేని వాడు బీదవాడు. అమ్మ ప్రేమను పొందినవాడు అత్యంత కోటీశ్వరుడు. అందుకే అమ్మను ఎప్పుడూ బాధపెట్టకూడదు. తన త్యాగపు పునాదుల మీద మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుకే అమ్మ ప్రేమను చాటి చెప్పడానికి అమ్మ త్యాగాన్ని తెలియచేసి అమ్మకు కృతజ్ఞతలు అర్పించడానికి మాతృ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది.
మాతృ దినోత్సవం
మన కోసం తన జీవితాన్నే త్యాగం చేసే అమ్మ కోసం ఒక వేడుక ఉండాలని కొందరు చేసిన ప్రయత్నాల ఫలితంగా అచ్చంగా అమ్మల కోసమే ‘మదర్స్ డే’ వచ్చింది. అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా దానికి గుర్తింపూ వచ్చింది. ప్రాచీన కాలంలో గ్రీకులు వసంత కాలం పొడవునా మాతృత్వ ఉత్సవాలు నిర్వహించే వారు. చెట్లు చిగిర్చే ఈ కాలాన్ని అమ్మతనానికి ప్రతిరూపంగా భావిస్తూ మాతృత్వ ప్రతీక అయిన గ్రీకు దేవతల తల్లి ‘రియా’కు ఉత్సవాలు జరిపేవారు. అదే విధంగా క్రీస్తు పూర్వం 250 ప్రాంతంలో రోమన్లు కూడా వసంత కాలంలో మాతృదినోత్సవాన్ని నిర్వహించేవారు. తమ అమ్మ దేవత ‘సిబెలె’ వేషధారణలతో, ఆటపాటలతో మూడురోజులపాటు ఈ పండుగ చేసుకునే వారు. ఇంగ్లండ్‌లో ఈస్టర్‌కి ముందు నలభైరోజులను ‘లెంట్ రోజులుగా’ పరిగణిస్తారు. 17వ శతాబ్దంలో ఇంగ్లండులో నలభై రోజులలోని నాలుగవ ఆదివారం నాడు తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్ సండే’ పేరిట ఉత్సవాలు జరిపేవారు.
1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాతృ దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించి, ఇందుకు గాను ఆమె బోస్టన్‌లో సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. సివిల్ వార్ గాయాల స్మృతులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్ షిప్’ డే నిర్వహించిన అన్నా మేరీ జెర్విస్ అనే మహిళ 1905 మే 9న చనిపోయింది. ఆవిడ కూతురైన మిస్ జెర్విస్ మాతృ దినోత్సవం నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతోపాటు, తన తల్లి రెండవ వర్థంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారం ‘మాతృ దినోత్సవం’ను నిర్వహించింది. అమెరికాలోనే తొలిసారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని జరపగా, జెర్విస్ చేసిన ప్రచారం ఫలితంగా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాలలో ఈ దినోత్సవం జరపడం సంప్రదాయంగా మారింది. 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ‘మాతృ దినోత్సవం’ను అధికారికంగా జరపాలని నిర్ణయించడంతోపాటూ, ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించి ప్రతి ఏడాది మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
మొత్తం 40 దేశాలకు పైగా మే నెల రెండవ ఆదివారం మాతృదినోత్సవం జరుపుకుంటారు. అమెరికాలో ఫిబ్రవరి రెండో ఆదివారం, దక్షిణాఫ్రికాలో మే నెల మొదటి ఆదివారం, అరబ్ దేశాల్లో మార్చి 21న, ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో మే 4వ ఆదివారం నిర్వహిస్తారు. జపాన్, న్యూజిలాండ్, కెనడా, భారత్‌తో సహా చాలా దేశాల్లో ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ రోజు 12 మే 2024న రావడం జరిగింది.
ఈ ఒక్క రోజు తంతు కాదు
అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, ట్వీట్లు, కామెంట్లు లక్షలాది వెల్లువెత్తుతాయి. వీటిని అన్నింటినీ చూస్తే ఈ లోకంలో అమ్మ పట్ల ప్రేమ విధేయతలు కలిగిన వారు ఇంత మంది ఉన్నారా అని ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది వాస్తవం కాదు. ఇది కేవలం ఒక రోజు తంతు మాత్రమే. వాస్తవంగా సామాజిక బంధాలు ఆర్థిక శాస్త్ర కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రస్తుత విషమ సమయంల్లో మనం ఉన్నాం. అమ్మ పట్ల చూపవలసిన ప్రేమ, ఆప్యాయతలు, బాధ్యతలు క్రమేపీ సన్నగిల్లిన దయనీయ పరిస్ధితులు కళ్ళ ముందు తారసపడుతున్నాయి. ప్రపంచీకరణ బలం పుంజుకున్న ప్రస్తుత తరుణంలో సమాజంలో వ్యక్తులు, కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధాలే కానీ, అనురాగ బంధాలు మృగ్యమై పోతున్నాయనే వాస్తవిక విమర్శ ఉంది. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకొని, డొక్కలు ఎండగట్టుకొని పిల్లలను పెంచితే పిల్లలకు రెక్కలు రాగానే ఒదిలిపెట్టి వెళ్లేవారు కొందరైతే, వృద్ధాశ్రమాల్లో చేరుస్తూ మరికొందరు, సేవకులను అప్పజెప్పి వేరే ఇళ్లల్లో ఉంచేవారు ఇంకొందరు. నవీన నాగరిక సమాజంలో నేడు మనం ఉన్నాం.
యదార్థ చిత్రం
అనాథను చేసి, వృద్ధాశ్రమాల్లో చేర్పించినా కూడా ఆ తల్లి మనసు బిడ్డల చుట్టూనే తిరుగుతుంటుంది. తల్లి యోగ క్షేమాలను విస్మరించి అశాశ్వతమైన భోగ భాగ్యాల వెంట పరుగులు తీసే విద్యాధికులెందరో మనకు నేటి సమాజంలో కనబడుతున్నారు. చిన్నప్పుడు ముద్ద తినకుండా శ్రమ పెట్టినప్పుడే కాదు, పెద్దయ్యాక పెట్టకుండా దూరం చేసినా అమ్మ పల్లెత్తు మాట అనలేదు. అనదు కూడా. అదీ అమ్మ ప్రేమలో ఉండే ప్రత్యేకత. ‘ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు.. పెట్టబోక ఏడిపించు నేడు’ అన్నారు గరికిపాటి నరసింహారావు. ఇది నేటి సమాజంలో ఎక్కువుగా కనిపిస్తున్న యదార్ధ చిత్రం. తన జీవితాన్ని అర్పితం చేసిన అమ్మపై నేటి తరం పిల్లలు చికాకులు, కసుర్లు ఈసడింపులు చేస్తున్నప్పటికీ మౌనంగా వాటిని భరిస్తున్న మాత మూర్తులు ఎందరో.
అమ్మకు ఏమివ్వగలం?
పాతికేళ్ల వరకూ మనమే లోకంగా గడిపింది అమ్మ. సమాజంలో ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తల్లిని పట్టుకుని.. నువ్వు నాకేమిచ్చావు? అని నిలదీస్తున్న కొడుకులున్న ఈ లోకంలో అమ్మ చేసే పనులన్నింటికీ జీతమివ్వాల్సి వస్తే ఆ కొడుకులు ఎంతివ్వాలి? ఎంతిస్తారు? ఇవ్వగలరా? అమ్మ చేసే పనికి జీతమివ్వాలంటే అది అక్షరాలా అనంతమే.. అవుతుంది. నానాటికీ తగ్గిపోయిన అమ్మ పాత్రతో అమ్మంటే విలువ లేనిదైపోయింది. విలువ లేని వస్తువును ఇళ్లలో ఎవరు పెట్టుకుంటారు? అందుకే వృద్ధులైన అమ్మలు, నాన్నలు ఓల్డేజ్ హోమ్‌లలో ఒంటరిగా గడుపుతున్నారు. అప్పుడప్పుడూ చూసొచ్చే మ్యూజియం వస్తువులుగా అమ్మలను తయారు చేశారు. తమ పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ.. కన్నబిడ్డలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురుచూస్తూ తడి ఆరని కళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. తాను హీనంగా పడి ఉండి కూడా బిడ్డల శ్రేయస్సును కాంక్షిస్తూనే ఉంటుంది.
ఈ పరిస్ధితుల నడుమ నేడు తల్లి పనికిరాని వస్తువయ్యింది. పిల్లలకు బరువైపోయింది. ఆ తల్లిని వదిలించుకొనే ప్రయత్నంలోనే ఎందరో నేటికాలపు పిల్లలు కొనసాగుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో స్నేహితులకు కేటాయించే సమయంలో పదవ వంతు కూడా అమ్మకి కేటాయించలేని పుత్ర రత్నాలు నేడు ఎందరో ఉన్నారు. తండ్రి మతి చెందిన తర్వాత అమ్మను నెలలు వారీ పంచుకునే వాళ్ళు కొందరైతే అమ్మ పోషణలో తేడాలు వచ్చి చివరకు ఆశ్రమానికి సాగనంపే వాళ్ళు ఇంకొందరు. తల్లి బాగోగులు పట్టించుకోక పోయినా ఆమెకు వచ్చే వృద్ధాప్యపు పించన్ దోచుకోవడానికి 1వ తేదీన తల్లి వద్దకు వాలి పోయే వాళ్ళు మరి కొందరు.
అమ్మకు ప్రేమను పంచుదాం
తల్లిని విస్మరించడం, దుర్భాషలాడడం క్షమించరాని నేరం. తల్లిని తృణీకరించి తదనంతరం చేసే పుణ్య కార్యాలకు ఫలితం శూన్యమన్న విషయం గ్రహించలేకున్నాం. అమ్మ ఉన్నంత కాలం మనం ఉంటాం. కానీ మనం ఉన్నంత కాలం అమ్మ ఉండదు. అందుచేత అమ్మ ఉన్న కాలంలోనే అమ్మకు ప్రేమను పంచుదాం. ఆమె మనల్ని శాశ్వతంగా విడిచి వెళ్లిన తరువాత ఆమె ప్రేమను పొందలేం. అందుకే ఈ క్షణం నుంచి అమ్మకు ప్రేమను అందించి అమూల్యమైన అమ్మ ప్రేమను పొందుదాం.
మన పిల్లలు గమనిస్తూనే వున్నారు
ఇటీవల పి అండ్ జి సంస్థ ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో తల్లి ఆశిస్తోంది పిల్లల నుంచి చిన్న కృతజ్ఞతా పూర్వకమైన మాటేనని, తల్లి చేసే సేవలకి కృతజ్ఞతలు చెప్తున్నవారి కంటే చెప్పనివారే ఎక్కువని తేలింది. జన్మ అనే గొప్ప వరాన్ని అందించిన మాతృమూర్తికి ఇష్టమైనవో, కోరుకున్నవో ఇచ్చి సంతోషపెడుతున్నవారు మరీ తక్కువగా 30 శాతానికి మించి లేరని సర్వే తేల్చింది. దీనిని బట్టి తల్లి పట్ల కృతజ్ఞత చూపే వారు క్రమేపీ తగ్గిపోతున్నారనేది బాధాకరమైన పరిణామం. కానీ తల్లి బిడ్డల పట్ల చూపే ప్రేమ బాధ్యతలతో ఏ మాత్రం తగ్గలేదు. ఇది అమ్మ ప్రేమ ప్రత్యేకత.. అయితే జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రాణ ప్రదంగా చూసుకునే బిడ్డలు లేకపోలేదు. తల్లిని నిత్యం ప్రేమిస్తూ వృద్ధాప్యంలో సేవలు చేస్తూ ప్రేమను పంచే మహనీయులు లేకపోలేదు. వారికి హృదయపూర్వక నమస్సులు తెలుపుదాం. అయితే సమకాలీన సమాజంలో ఇటువంటి వారు చాలా అరుదై పోయారు. అటువంటి అరుదైన జాబితాలో మనం ఉన్నామా లేదా అనేది మన మనఃసాక్షికే తెలియాలి. మన తల్లిదండ్రుల పట్ల మనం చూపే బాధ్యత, ప్రేమాభిమానాలు, చేసే సేవలు మన పిల్లలు గమనిస్తూనే ఉన్నారు. మన పిల్లలు అమాయకులు కాదు. దాని పర్యవసానం మనం అనుభవించక తప్పదు.
అమ్మకు వందనం
అమ్మ కోసం మన జీవితాన్ని ఆమె పాదాల ముందు పరచినా సరిపోదు. కానీ అమ్మకు ఒక కృతజ్ఞత.. అమ్మ త్యాగానికి ఓ వందనం.. అన్నిటికీ మించి తరగని ప్రేమ చూపే త్యాగశీలి అమ్మ పట్ల ఆదరణ చూపగలిగితే చాలు. అమ్మకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతి రోజూ అమ్మదే అని అన్ని రోజులూ అమ్మకు ప్రేమను అందించగలిగిన నాడు మాతృ దినోత్సవానికి సార్ధకత చేకూరుతుంది. జీవాన్ని, జీవితాన్నే కాదు.. జీవితకాలపు ప్రేమైక మమకారాన్ని పంచే తల్లులకు మాతృ దినోత్సవ శుభ సందర్భాన వందనాలు.. పాదాభివందనాలు.
– రుద్రరాజు శ్రీనివాసరాజు
9441239578