తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష ..!

Amnesty for Telangana NRIs ..!– ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్‌ కృషి
– దుబారు రాజుతో భేటీకి ప్రయత్నాలు
నవతెలంగాణ – సిరిసిల్ల రూరల్‌
దుబాయ్ లోని అవీర్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్‌ మరోసారి ప్రయత్నిస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల కోసం దుబాయ్ లో పర్యటిస్తున్న కేటీఆర్‌ ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసును వాదిస్తున్న అరబ్‌ లాయర్‌, దుబారులో భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేష్‌, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్‌, శివరాత్రి హనుమంతులు ఒక కేసులో భాగంగా దుబారులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు 15ఏండ్లకు పైగా శిక్ష పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే ఈ నేరంలో ప్రాణం కోల్పోయిన నేపాల్‌కు చెందిన బాధిత కుటుంబం దగ్గరికి గతంలో వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. దియ్య సొమ్ము(బ్లడ్‌ మనీ) అందించారు. ఆ తర్వాత ఆ కుటుంబం క్షమాభిక్ష పత్రాన్ని దుబారు ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇతర కారణాలు, నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం క్షమాభిక్షను ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఆరు నెలల కింద మరోసారి మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే బాధిత కుటుంబానికి రూ.15లక్షల నష్టపరిహాన్ని షరియా చట్టం ప్రకారం దియ్య(బ్లడ్‌ మనీ) రూపంలో అందించినట్టు తెలిపారు. 2013లో నేపాల్‌ విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకొని క్షమాభిక్షకు అవసరమైన అన్ని రకాల పత్రాలను దుబారు ప్రభుత్వానికి భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ద్వారా అందించామని తెలిపారు. అయినా, నిందితులకు ఉపశమనం లభించలేదని మంత్రి కేటీఆర్‌ బుధవారం భారత కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ అధికారులకు, దుబారు ప్రభుత్వాధికారులకు తెలియజేశారు. సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించి మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.అంతకుముందు జరిగిన బిజినెస్‌ సమావేశాల సందర్భంగా రాజ కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్న పలువురు వ్యాపారవేత్తలతో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, మానవతా దృక్పథంతో తెలంగాణ ఎన్నారైల క్షమాభిక్ష కోసం సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, దుబాయ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని స్థానిక చట్టాల మేర చర్చించేందుకు పనిచేస్తామని మంత్రికి వారు హామీ ఇచ్చారు.

Spread the love