ఐదు గురుకులాల్లో

ఒకే కాల నిర్ణయ పట్టికను అమలు చేయాలి
 సీఎస్‌కు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఐదు రకాల గురుకుల విద్యాసంస్థల్లో ఒకే కాల నిర్ణయ పట్టికను అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారిని మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థలు, ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ గురుకులాలు, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ గురుకులాలు, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ గురుకులాలున్నాయని వివరించారు. అన్ని రకాల గురుకుల పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతిలో 80 మంది విద్యార్థులు రెండు సెక్షన్లుగా నిర్వహి స్తున్నారని తెలిపారు. కొన్నింటిలో ఇంటర్‌ తరగతులను కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఐదు రకాల గురుకుల విద్యాసంస్థల్లో కాల నిర్ణయ పట్టిక ఒకే రకంగా లేదని తెలిపారు. ఒకే రకమైన కాల నిర్ణయ పట్టికను అమలు చేయాలని కోరారు. ఇంటర్‌ తరగతులు బోధించే అధ్యాపకుల వేతన స్కేలు వేర్వేరుగా ఉన్నట్టుగా తన దృష్టికి వచ్చిందని వివరించారు. అన్ని రకాల విద్యాసంస్థల్లో ఇంటర్‌ బోధిస్తున్న అధ్యాపకుల వేతన స్కేలు సమానం చేయాలని పేర్కొన్నారు. ఐదు రకాల గురుకుల విద్యాసంస్థల్లో ఒకే రకమైన నిబంధనలుండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love