కుల గణన సర్వేపై మండలిలో వాగ్వాదం

Minister Ponnam– ఈబీసీ రిజర్వేషన్ల కోసం బీసీల జవాభాను తక్కువ చూపించారు
– సర్కార్‌ తీరుతో భవిష్యత్‌లో బీసీలు నష్ట పోతారు : తీన్మార్‌ మల్లన్న
– తప్పులుంటే సూచనలివ్వండి.. సరిదిద్దుకుంటాం…
– మొత్తం ప్రక్రియను తప్పుపట్టడం సరికాదు : మంత్రి పొన్నం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కులగణన సర్వేపై గురువారం శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది.గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 10 శాతం ఈబీసీ కోటా రిజర్వేషన్ల కోసం బీసీల జనాభాను తక్కువ చేసి చూపించారని మల్లన్న ఆరోపించారు. కుల గణన సర్వే తప్పుల తడకని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అనాలోచిత చర్య వల్ల భవిష్యత్‌లో బీసీలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈదశలో జోక్యం చేసుకున్న పొన్నం, తీన్మార్‌ వ్యాఖ్యలను ఖండించారు. భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పారదర్శకంగా తెలంగాణ సర్కార్‌ కులగణన సర్వే చేసిందని చెప్పారు. 150మందికి ఒక ఎన్యూమనేటర్లను నియమించి పొరపాట్లకు తావు లేకుండా సర్వే చేసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వందకు వంద శాతం సక్సెస్‌ అయ్యిందనీ, హైదరాబాద్‌తో పాటు కొన్ని పట్టణాల్లో మాత్రం కొంత మిగిలి పోయిందని గుర్తు చేశారు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సలహాలు, సూచనలిస్తే సవరించుకుంటామని పేర్కొన్నారు. అయితే పొన్నం వాదనతో తీన్మార్‌ ఏకిభవించలేదు. సర్కార్‌ కొన్ని వర్గాలకు లబ్ది చేసేందుకు బీసీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. పొన్నం ప్రభాకర్‌ బీసీ మంత్రిగా ఉండి కూడా ఏమి చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1951 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 808 మంది మంత్రులుగా ఉంటే, అందులో ఓసీలు 543 మంది కాగా, 212 మంది మాత్రమే బీసీలు ఉన్నారని గణాంకాలతో సభకు తెలిపారు. అలాగే విద్య, ఉద్యోగ, తదితర అన్ని రంగాల్లో దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరిగిందని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తాననీ, అదే సందర్భంలో వారి నోటి కాడి కూడును లాక్కోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ తదుపరి సీఎం పొన్నం ప్రభాకరే అంటూ తీన్మార్‌ పేర్కొన్నారు. దాంతో పొన్నం రెండు చేతులు జోడించి తనను ఎందుకు అనవసరమైన విషయాల్లో లాగుతున్నారంటూ సభనుంచి వెళ్లి పోయారు. ఆ తర్వాత సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్టుమండలి వైస్‌ చైర్మెన్‌ బండ ప్రకాష్‌ ప్రకటించారు.

Spread the love