నవతెలంగాణ – అమరావతి: స్నేహితులతో పందెంకాసి కాల్వలో దూకిన ఆర్మీ జవాను గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో జరిగిందీ ఘటన. 24 ఏళ్ల పవన్ అనే ఆర్మీ జవాను స్నేహితులతో పందెం కాసి కేసీ కాల్వలో ఈతకు దిగాడు. అయితే, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయాడు. దీంతో కంగారుపడిన స్నేహితులు వెంటనే పోలీసులు, స్థానికులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పవన్ ప్రస్తుతం జమ్మూలో జవానుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.