ప్రమాదవశాత్తు కారు ప్రమాదం..వృద్ధ దంపతులు మృతి

– ఇద్దరికి తవ్ర గాయాలు – మరొకరి పరిస్థితి విషమం
– కారులో మధిర నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రమాదం
నవతెలంగాణ – బోనకల్
చిన్న కుమారుడు దగ్గర నుంచి పెద్ద కుమారుడు వద్దకు వృద్ధ దంపతులను మనవడు తన సొంత కారులో తీసుకెళ్తున్నాడు. ఇంతలోనే బోనకల్ – ముష్టికుంట గ్రామాల మధ్య ప్రమాదవశాత్తు కారు రోడ్డు పక్కనే గల చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు డ్రైవింగ్ చేస్తున్న మనవడు, వృద్ధ దంపతులకు సహాయకుడిగా పనిచేస్తున్న నాగరాజు తీవ్ర గాయాలు పాలయ్యారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చినయాంసముగా మారింది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం…
ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెంగోళ్ళు గ్రామానికి చెందిన కొత్తూరు సూర్యనారాయణ డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా పనిచేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. ఉద్యోగ విరమణ అనంతరం భార్య రుక్మిణి తో కలిసి మధిర పట్టణంలో స్థిరపడ్డాడు. సూర్యనారాయణ, రుక్మిణి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తనకు వస్తున్న పెన్షన్ తో జీవిస్తున్నాడు. సూర్యనారాయణకు ముగ్గురు కుమారులు ఉండటంతో ముగ్గురు కుమారులు ఒక్కొక్క నెల చొప్పున తల్లిదండ్రులను పోషిస్తున్నారు. దీంతోపాటు తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ఆన్లైన్లో కేర్ టేకర్ ను బుక్ చేసుకున్నారు. నాగరాజు అనే వ్యక్తి సూర్యనారాయణ రుక్మిణి దంపతులకు నిత్యం సహాయకుడుగా ఉంటూ సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో మధిరలో చిన్న కుమారుడు గురు వెంకటేశ్వర్లు దగ్గర నెలరోజుల సమయం పూర్తి కావడంతో పెద్ద కుమారుడు విజయకుమార్ వంతు కావటంతో ఖమ్మంలో నివాసము ఉంటున్న విజయ కుమార్ తన తండ్రిని తీసుకొని రమ్మని కుమారుడు అనిల్ ని పంపించారు. అనిల్ తన తాతయ్య, నాయనమ్మలను తీసుకొని రావడానికి ఖమ్మం నుంచి బుధవారం తన సొంత కారు తీసుకుని మధిర వెళ్ళాడు. అనిల్ తన కారులో తాతయ్య, నాయనమ్మలు సూర్యనారాయణ, రుక్మిణి లతో పాటు వారికి సహాయకుడిగా ఉంటున్న నాగరాజును కారులో తీసుకొని బోనకల్ మీదుగా ఖమ్మం బయలుదేరారు. బోనకల్లు -ముష్టికుంట గ్రామాల మధ్య చిరునోముల గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఎస్పి అందాసు వెంకటేశ్వర్లు పొలము వద్ద కారు ఒక్కసారిగా ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ, రుక్మిణి కారులోనే ప్రాణాలు కోల్పోయారు. అనిల్, నాగరాజు తీవ్ర గాయాలతో ప్రాణాలతో ఉన్నారు. అదే సమయంలో బోనకల్ మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్ ఖమ్మం నుంచి బోనకల్లు వస్తున్నారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలోనే మరికొందరు 108కు సమాచారం అందించారు.
అప్పటికే 108 ఖమ్మం నుంచి బోనకల్లు వస్తూ ముష్టికుంట గ్రామం దాటింది. రెండు నిమిషాలలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే కారులో ఉన్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే 108 సిబ్బంది తమ వద్ద గల ఎక్కుమెంట్ గడ్డపార, ఫైర్ ఎగ్జాస్టర్ సహాయంతో కారు తలుపులను పగలగొట్టి సూర్యనారాయణ, రుక్మిణి మృతదేహాలతో పాటు అనిల్, నాగరాజులను బయటకు తీశారు. అప్పటికే కారు ముందు భాగం నుంచి మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆ మంటలలోనే వారిని 108 సిబ్బంది ప్రాణాలకు తెగించి బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్న అనిల్, నాగరాజులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. బోనకల్ ఎస్సై కడగండ్ల మధుబాబు హుటా హుటేనా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత మధిర సీఐ దొంగరి మధు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వృద్ధ దంపతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా పోలీసులు మృతదేహాలను గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తించారు. రుక్మిణి ఒంటిపై సుమారు 15 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఆ బంగారు నగలను పోలీసులు తీయించి వారికి అప్పగించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి ఓ ప్రైవేటు వాహనంలో తరలించారు.
Spread the love