భావోద్వేగాల్లేని ప్రాంఛైజీ

భావోద్వేగాల్లేని ప్రాంఛైజీ– ముంబయి ఇండియన్స్‌పై అభిమానుల ఆగ్రహం
– కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించటంపై విమర్శలు
– సోషల్‌ మీడియాలో గణనీయంగా తగ్గిన ఫాలోవర్లు
నవతెలంగాణ-ముంబయి
సోషల్‌ మీడియాలో లక్షల సంఖ్యలో అన్‌ఫాలోలు సహా ముంబయి స్టార్‌ క్రికెటర్ల పోస్టులు సైతం వైరల్‌ అయ్యాయి. సూర్యకుమార్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు హృదయం ముక్కలైన ఎమోజీలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో అభిమానులు రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించినందుకే బుమ్రా, సూర్య ఇలా స్పందించారని భావిస్తున్నారు.
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అత్యంత విజయవంతమైన జట్లలో ముంబయి ఇండియన్స్‌ ఒకటి. చెన్నై సూపర్‌కింగ్స్‌తో సమానంగా ఆ జట్టు ఐదు సార్లు చాంపియన్‌గా నిలిచింది. గత మూడు సీజన్లలుగా ముంబయి ఇండియన్స్‌ను టైటిల్‌ దాహం వెంటాడుతోంది. మరో టైటిల్‌ కోసం ఎదురు చూసేందుకు ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం సహనం చూపించలేదు. అందులో భాగమే.. హార్దిక్‌ పాండ్యను సొంత గూటికి తెచ్చుకుని మరీ సారథ్య పగ్గాలు అప్పగించింది. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ వదలుకుని హార్దిక్‌ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు తిరిగి రావటంతోనే అందరికీ అసలు విషయం అర్థమైంది. ఐపీఎల్‌ 16 నాటికి రోహిత్‌ శర్మ వయసు 38 ఏండ్లకు దగ్గర కానుంది. దీర్ఘకాలిక ప్రణాళికలను సైతం దృష్టిలో ఉంచుకుని ముంబయి ఇండియన్స్‌ సారథ్య పగ్గాలు హార్దిక్‌ పాండ్యకు అప్పగించేందుకు సిద్ధమైంది. పాండ్య కెప్టెన్సీ పగ్గాలు అప్పగించటంపై ఎవరికీ ఆశ్చర్యం లేదు.. కానీ మరీ ఇంత త్వరగా ఇస్తారని ఎవరూ ఊహించలేదు.
ముంబయి దారి రహదారి
ఆటగాళ్లను కుటుంబంగా భావించే ఐపీఎల్‌ ప్రాంఛైజీల్లో కచ్చితంగా ముంబయి ఇండియన్స్‌ ఒకటి. ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఎంతో మంది క్రికెటర్లను.. వివిధ బాధ్యతల్లో ప్రాంఛైజీ కొనసాగిస్తోంది. కానీ జట్టును నడిపించే అంశంలో ముంబయి ఇండియన్స్‌ ఎన్నడూ భావోద్వేగాలకు చోటు ఇవ్వలేదు. సచిన్‌ టెండూల్కర్‌, రికీ పాంటింగ్‌, హర్బజన్‌ సింగ్‌, లసిత్‌ మలింగ, కీరన్‌ పొలార్డ్‌ ముంబయి ఇండియన్స్‌ను ఐపీఎల్‌ దిగ్గజంగా నిలిపిన వారిలో కీలకం. అయినా.. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇప్పుడు రోహిత్‌ విషయంలోనూ అదే జరిగింది. 2013 ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అటువంటి పరిస్థితి మరోసారి పునరావృతం కావద్దేనే ముంబయి ఇండియన్స్‌ 16వ సీజన్‌కు మూడు నెలల ముందే కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. ముంబయి ఇండియన్స్‌ క్రికెట్‌ వ్యవహారాల్లో నిర్ణయాలను యాజమాన్యం స్వయంగా పర్యవేక్షిస్తుంది. నాయకత్వం బృందంతో క్రియాశీలంగా సమాలోచనలు చేస్తుంది. హార్దిక్‌ పాండ్యను సారథిగా ఎంపిక చేయటంలో యాజమాన్యం పాత్ర అత్యంత కీలకం.
అక్కడే అభ్యంతరం
చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు రవీంద్ర జడేజా అందుకున్నప్పుడు.. ఎటువంటి అలజడి లేదు. ఎందుకంటే చెన్నై నేరుగా కొత్త సారథిగా జడేజాను ప్రకటించలేదు. ఎం.ఎస్‌ ధోని స్వయంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. జడేజాకు అన్ని విధాలుగా తోడు ఉంటానని వెల్లడించాడు. జడేజా నాయకత్వ శైలి సూపర్‌కింగ్స్‌ను గెలుపు దారిలో నడిపించలేదు అది వేరే కథ. కానీ ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం రోహిత్‌ శర్మకు ఆ గౌరవం ఇవ్వలేదు. 2023 ఐపీఎల్‌ ముగిసిన వెంటనే హార్దిక్‌ అంశాన్ని రోహిత్‌తో చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే షరతుతోనే హార్దిక్‌ ముంబయి గూటికి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కనపెడితే.. రోహిత్‌ గౌరవంగా నాయకత్వ బాధ్యతలు వదిలేసే అవకాశం ఇవ్వలేదని అభిమానులు ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా (ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌) వేదికల్లో లక్షల సంఖ్యలో అభిమానులు అన్‌ఫాలో అవుతున్నారు. రోహిత్‌ అభిమానులు ఏకంగా ముంబయి ఇండియన్స్‌ జెర్సీలు తగులబెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

Spread the love