తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంతటా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని యూసుస్‌గూడాలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ అర్ట్స్ స్కూల్ అమ్మాయిలు తమ చిత్రకళలను మొదటిసారి ఇక్కడ ప్రదర్మించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్ధుల అభిప్రాయం మానవి పాఠకుల కోసం…
పెయింటింగ్ బాగా నేర్పిస్తున్నారు
ఉమా మహేశ్వరి… తను గీసిన ఈ చిత్రానికి పెట్టిన పేరు. (spell bound landscape). ఈ చిత్రం చూసిన వారు మంత్రముగ్ధులు కావాల్సిందే. ప్రకృతి అందాల నడుమ సరంగు నావ. దీన్ని అక్రిలిక్ పైంటింగ్ అంటారు. ఈ చిత్రం గీయటానికి ఆమెకు వారం రోజులు పట్టింది. ”మాది వరంగల్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. ఏడవ తరగతి నుంచి ఇదే గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. ఉదయం పూట మాకు రెగ్యులర్ పాఠాలు ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తారు. ఇంటర్ తర్వాత ఇక్కడే బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాను. ఈ ఆర్ట్స్ స్కూల్ల్ మాకు పెయింటింగ్ చాలా బాగా నేర్పిస్తున్నారు. భవిష్యత్‌లో మంచి చిత్రాలు వేసి పెద్ద పెద్ద ప్రదర్శనల్లో పాల్గొంటాను.
తమలోని కళను ప్రదర్శించేందుకు చాలా మంది తపన పడుతుంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అందునా అమ్మాయిలు కళల్లో రాణించడం అంత సులభం కాదు. వేలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకోవడం ఆర్థికంతో ముడిపడి ఉంటుంది. అందుకే ఆర్ట్స్ వైపు వచ్చే వారు కొంత మంది మాత్రమే ఉంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఫైన్స్ ఆర్ట్స్ కోర్సులు ప్రారంభించింది. దాంతో అట్టడుగు స్థాయి అమ్మాయిలకు కూడా కళలు దగ్గరయ్యాయి. తమలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు.
ఆకట్టుకుంటున్నాయి
ఎంతో మంది ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులు గీసిన చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. ప్రదర్శనకు వచ్చిన వారందరి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు వీరు గీసిన చిత్రాలు నచ్చి కొంతమంది కొనుగోలు కూడా చేస్తున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన పాఠశాల ప్రిన్సిపల్, ఆర్ట్ గురువులు రమేష్, విక్రమ్, కిరణ్మయిలకు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సవిత అనే మరో విద్యార్థిని గీసిన ‘వనిత’ చిత్రం పెన్సిల్ స్కెచ్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇంకా ఎన్నో చిత్రాలు కొన్నవారి ఇంటి అందాలు పెంచుతున్నాయి. వినాయకుడు, మిరాబాయి చిత్రాలు ఒక్కరోజులోనే అమ్ముడుపోయాయంటే వెల్ఫేర్ కాలేజీ అమ్మాయిలు వేసిన చిత్రకళ ఎంతటి చూడముచ్చటగా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘కళ కొందరికి మాత్రమే పరిమితం. కాదు అవకాశాలు ఇస్తే మేము సైతం మాలోని నైపుణ్యాలను ప్రపంచానికి చాటిచెబుతాం’ అంటూ ఈ గురుకుల కాలేజీ అమ్మాయిలు రుజువు చేశారు.
ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం
రజిత… గీసిన చిత్రం (వడ్రంగి పిట్ట) చెట్టు బెరడును చీల్చడంలో ఎంతో బిజీ. దీని టైటిల్ బిజీ ఎట్ పొకింగ్ (Woodpecker). ఏడోతరగతి నుంచి నేను ఇక్కడే చదువుతున్నాను. ఇక్కడే ఇంటర్ పూర్తి చేశాను. మేము ఈసీఐల్‌లో వుంటాము. చిన్నప్పటి నుండి ఫైన్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఈ ప్రదర్శనలో నేను గీసిన వడ్రంగి పిట్ట చిత్రానికి ఆక్రిలిక్ కలర్స్ వాడాను. మా ఫైన్ ఆర్ట్స్ స్కూల్ నాకు బాగా నచ్చింది. చిత్రకళలో ఎన్నో మెళుకువలు నేర్చుకుంటున్నాను.