దేశానికే ఆదర్శం

– సీఎం కేసీఆర్‌కు స్వామీజీల ఆశీస్సులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం సహా అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నా రని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును అభినందించారు. దార్శనిక పాలనతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీరశైవ పంచ పీఠం లోని కాశీ, ఉజ్జయినీ, శ్రీశైల పీఠాల జగద్గురువులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు. చంద్రశేఖర శివాచార్య మహాస్వామి (కాశీ), సిద్దలింగ శివా చార్య మహాస్వామీ (ఉజ్జయినీ), చెన్నసిద్ధ రమా పండితారాధ్య శివాచార్య మహాస్వామి(శ్రీశైలం) శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. వారితో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలనుంచి పలువురు శివాచార్య మహాస్వాములు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌, ఆయన భార్య శోభ దంపతులను స్వామీజీలు ఆశీర్వదించారు. రాజకీయంగా సీఎం ఆకాంక్షలు నెరవేరతాయనీ, దానికి తమ సహకారం అందిస్తామనీ చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు శంకరన్న దోండ్గే, మాణిక్‌ కదమ్‌, హిమాన్షు తివారి తదితరులు పాల్గొన్నారు.

Spread the love