అడుగంటిన భూగర్భం.. తాగునీటికి తాపం..!

– సక్రమంగా సరఫరా కాని భగీరథ నీరు
– పనిచేయని చేతిపంపులు.. ఎండిపోయిన వాగులు
– అల్లాడుతున్న ఏజెన్సీ పల్లెలు
– బావులు, చెలిమెలపైనే ఆధారపడుతున్న గిరిజనం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
వర్షాకాలం సమీపిస్తున్నా.. వేసవి తాపం జనాలను వదలడం లేదు. మండుతున్న ఎండలకు తోడు.. తాగునీటికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి. ఊరూరా మిషన్‌ భగీరథ నల్లాలు బిగించినా.. సక్రమంగా సరఫరా కాకపోవడంతో అనేక పల్లెలు తాగునీటికి గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో చేతిపంపులు పనిచేయడం లేదు. గంటల తరబడి కొడితే కానీ చుక్కనీరు రాలేని పరిస్థితి ఉంది. ఏజెన్సీ పల్లెల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక ఏజెన్సీ పల్లెలు గొంత తడుపుకొనేందుకు తండ్లాడుతున్నాయి. బిందెడు నీటి కోసం కొండలు, కోనలు దాటుతూ బావులు, చెలిమెల వద్దకు వెళ్తున్నారు. అడుగుభాగాన మిగిలిన కొద్దిపాటి నీటిని తెచ్చుకుంటూ దాహం తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం రూ.కోట్లాది నిధులు వెచ్చించి ఊరూరా మిషన్‌ భగీరథ ట్యాంకులు నిర్మించినా పూర్తిస్థాయిలో సత్ఫలితాలివ్వడం లేదు. సరఫరాలో అంతరాయం కలుగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది ఏకంగా 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాజాగా జిల్లాలో సగటున 8మీటర్ల లోతులో నీటి మట్టం ఉన్నట్టు భూగర్భజల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో చేతిపంపులు పనిచేయడం లేదు. బిందెడు నీరు రావాలంటే గంటల తరబడి కొట్టాల్సిన పరిస్థితి. మరోపక్క మిషన్‌ భగీరథ ట్యాంకులు నిర్మించి..పైప్‌లైన్లు వేసినా సరఫరాలో లోపం కారణంగా అనేక పల్లెలకు తాగునీరు సక్రమంగా అందడం లేదు. గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని.. సమస్య తీర్చడానికి ప్రత్యా మ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ఇటీవల జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రవెల్లి, తలమడుగు, బజార్‌ హత్నూర్‌ తదితర మండలాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆయా మండలాల జడ్పీటీసీలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోకపోవడంతోనే కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
బావులు, చెలిమెలే దిక్కు..!
మిషన్‌ భగీరథ పథకం రాకముందు ఏజెన్సీలోని వందలాది గ్రామాలు తాగునీటి సమస్య ఎదుర్కొనేవి. కానీ భగీరథ వచ్చిన తర్వాత పల్లెల్లో కొంతవరకు సమస్య తీరింది. అయినా ఎండలు పెరగడంతో చాలా పల్లెల్లో ఇంకా నీటి సమస్య తీవ్రంగా ఉంది. భగీరథ నీటి సరఫరాలో తలెత్తిన లోపాల కారణంగా ఆయా పల్లెలు తాగునీటికి తండ్లాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని మామిడిగూడతోపాటు కైర్‌గూడ, సాలెగూడ, దుర్వగూడ, దొడంద, గట్టెపల్లి, దనోరా(బి), దస్నాపూర్‌గూడ తదితర గ్రామాల్లో నీటి సమస్య కనిపిస్తోంది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం అల్లికోరి, లోహర, మాంగ్లిలోనూ ఈ సమస్య ఉంది. మిగితా మండలాల్లోని మారుమూల పల్లెల్లోనూ తాగునీటి సమస్య నెలకొంది. తాగునీటి కోసం ఊరి పొలిమేరల్లో ఉన్న బావుల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అనేక గిరిజన పల్లెల్లో ఈ సమస్య ఉన్నా అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది
ఏజెన్సీ పల్లెల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. చాలా గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా సరఫరా కావడం లేదు. పైప్‌లైన్లు లీకేజీలు, నల్లాలు సక్రమంగా ఉండకపోవడం కారణంగా సరఫరా కావడం లేదు. చేతిపంపులు పనిచేయడం లేదు. అడుగంటిన బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని గిరిజనులు తెచ్చుకుంటూ తాగేందుకు వినియోగిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
పుర్క బాపురావు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి

Spread the love