– ఆయన పేరిట జానపద యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
– రాష్ట్ర ప్రభుత్వానికి సినీనటుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి
– ప్రజల్లో ఆలోచనాశక్తి పెంచడంలో కళారూపాలే కీలకం : జస్టిస్ రాధారాణి
– విమలక్కకు సుద్దాల హన్మంతు-జానకమ్మ పురస్కారం అందజేత
– కీర్తి కాదు..ఇది నాకు స్ఫూర్తి : విమలక్క
– అలరించిన చిన్నారుల ఆటపాటలు, కళాప్రదర్శనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై సుద్దాల హన్మంతు విగ్రహాన్ని పెట్టాలనీ, జానపద కళారూపాలను బతికించేందుకు ఆయన పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సినీ నటుడు, దర్శకులు ఆర్.నారాయణమూర్తి కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హన్మంతు-జానకమ్మ జాతీయ పురస్కారాన్ని అరుణోదయ కళాకారులు విమలక్కకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజావాగ్గేయకారులు ధిక్కార స్వరాన్ని వినిపిస్తారనీ, నిజాం బెదిరింపులకు భయపడకుండా ప్రాణాలొడ్డి పోరాడిన యోధుడు, విలువలున్న మహోన్నత వ్యక్తి సుద్దాల హన్మంతు అని కొనియాడారు. ప్రజాగాయకుడు గద్దర్‌కు స్ఫూర్తి హన్మంతే అని చెప్పారు. ఆయన గొప్ప డాక్టర్, పోరాట యోధుడు, కళాకా రుడు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలకు ఉద్యమ పాఠాలను నూరిపోసిన మహనీయుడు అని కొనియాడారు. మిత్రులను ఎప్పుడూ మర్చిపోవద్దనీ, బాల్యస్నేహితులను గుర్తించుకుని మరీ సన్మానించడం అశోక్‌తేజ మంచితనమని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి మాట్లాడు తూ.. ప్రజల ఆలోచనాశక్తి పెంచడంలో, చైతన్యపర్చడంలో కళారూపాల పాత్రల కీలకమని చెప్పారు. పాటల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచిన వ్యక్తి హన్మంతు అన్నారు. హన్మంతు రాసిన ‘పల్లెటూరి పిల్లగాడ’, అశోక్ తేజ రాసిన ఒకటే జననం..ఒకటే మరణం..పాటలు తనలో స్ఫూర్తి నింపాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రొఫెసర్ చింతకింది కాశీం మాట్లాడుతూ..అంటరాని వెలివాడల్లో పుట్టిన తాము తెలుగు సాహిత్యంలో ఈ స్థాయికి ఎదగడానికి పాటనే కీలకమని చెప్పారు. పదేండ్ల దాకా బడికిపోని తనకు పాఠశాల బాటపట్టించి విశాల ప్రపంచాన్ని చూపించిన ఘనత సుద్దాల హన్మంతు రాసిన పల్లెటూరి పిల్లగాడ పాటకే దక్కుతుందన్నారు. ప్రజల బాధల్లోకి సూక్ష్మస్థాయి వరకు వెళ్లి పాటలు రాసిన వారే చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు క్యాపిటల్ గ్రంథం అధ్యయనం పెరుగుతున్నదనీ, ఇది మంచి పరిణామం అని అన్నారు. ప్రముఖ రచయిత ఆయినంపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ధిక్కార గళగర్జిని విమలక్క అన్నారు. ప్రజల కోసం పాటలు పాడే కళాకారులను భుజం తట్టి ప్రోత్సహించాలనీ, అది వారిని మరింత చైతన్యం చేస్తుందని చెప్పారు. విమలక్క మాట్లాడుతూ..ఈ అవార్డు తనకు రావడం కీర్తి కాదు స్ఫూర్తి అన్నారు. సుద్దాల హన్మంతు-జానకమ్మ అవార్డు తనకు రావడమంటే ప్రజల పాటకు పట్టం గట్టడమేనన్నారు. సుద్దాల, తన కుటుంబానికున్నది ప్రాంత సంబంధమే కాదు..వర్గ సంబంధమని చెప్పారు. ఆంధ్రమహాసభ పిలుపులో తమ రెండు కుటుంబాలు ప్రజల కోసం పోరాడినవని గుర్తుచేశారు. సిటీ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు స్మారకోపన్యాసం చేశారు. సుద్దాల గ్రామస్తుడు జగన్మోహన్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షలు సుద్దాల అశోక్‌తేజ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారులు సుద్దాల సుధాకర్‌తేజ, ప్రభాకర్‌తేజ, రచ్చ భారతి, కౌముది పాల్గొన్నారు. అందె భాస్కర్ బృందం ప్రదర్శించిన డప్పు కళావిన్యాసం, స్వప్న నేతృత్వంలో ప్రదర్శించిన శాస్త్రీయ లలిత గీతాలు, ఇండియన్ స్కూల్ అకాడమీ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన మన చరిత్ర నాటిక ప్రదర్శన, చిన్నారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.