ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న స్వతంత్ర అభ్యర్థి ఎట్టకేలకు అరెస్ట్‌

ఎన్నికల అధికారిపై చేయిచేసుకున్న స్వతంత్ర అభ్యర్థి ఎట్టకేలకు అరెస్ట్‌జైపూర్‌ : రాజస్థాన్‌లో ఉప ఎన్నిక సమయంలో ఒక అధికారిపై చేయి చేసుకున్న స్వతంత్ర అభ్యర్థి ఎట్టకేలకు అరెస్ట్‌ అయ్యాడు. ఆయన మద్దతుదారులు, అనుచరుల అల్లర్లు, ఆందోళనలు, తీవ్ర హైడ్రామ అనంతరం ఒక రోజు తర్వాత ఆయన అరెస్ట్‌ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం టోంక్‌ జిల్లాలోని డియోలీ-ఉనియార అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అయితే, ఈ ఉప ఎన్నిక సందర్భంగా సమ్రవత గ్రామంలో కొందరు ఓటింగ్‌ను బహిష్కరించారు. ఈ విషయం గురించి తెలిసిన సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేటు (ఎస్‌డీఎం).. తహశీల్దార్‌, అదనపు ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఈ గ్రామానికి చేరుకున్నరు. అదే సమయంలో పోలింగ్‌ బూత్‌కు చేరుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నరేశ్‌ మీనా.. అక్కడున్న ఎస్‌డీఎంపై భౌతిక దాడికి దిగాడు. సదరు అధికారిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ చర్యతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకున్న అదనపు ఎస్పీ.. నరేశ్‌ మీనాను నిరోధించారు.అయితే, బుధవారమే ఆయనను అరెస్ట్‌ చేయటానికి పోలీసులు ప్రయత్నించారు. కానీ, నరేశ్‌ మీనా మద్దతుదారులు తీవ్ర హింస, అలజడిని సృష్టించారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు నిరసనకారుల పైకి భాష్ప వాయువును ప్రయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, నరేశ్‌ మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. దీంతో, బుధవారంనాడు పోలీసులు నరేశ్‌ మీనాను అరెస్ట్‌ చేయలేపోయారు. గురువారం నాడు ఆయనను అరెస్ట్‌ చేయటానికి పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. ఈ విషయం తెలుసుకున్న నరరేశ్‌ మీనా మద్దతుదారులు.. పోలీసు చర్యను నివారించటానికి రోడ్డు మీద టైర్లను తగలబెట్టారు. ఎట్టకేలకు.. గురువారం నరేశ్‌ మీనాను అరెస్ట్‌ చేశారు. చట్టపరంగా ఆయనపై చర్యలుంటాయని టోంక్‌ ఎస్పీ వికాస్‌ సంగ్వాన్‌ తెలిపారు.
అల్లర్లలో 24 పెద్ద వాహనాలు, 48 మోటార్‌ సైకిళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు అనేక ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అధికారులు భద్రతా దళాలను మోహరించారు. కాగా, ఎస్‌డీఎంపై స్వతంత్ర అభ్యర్థి చేయిచేసుకోవటానికి సబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Spread the love