– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ బి.పద్మ
– డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిని విధుల నుంచి తొలగించాలి : ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్
– షాద్‌నగర్‌లో భారీ ర్యాలీ, నిరసన
– బాధితురాలు సునీతకు పలువురి పరామర్శ
నవతెలంగాణ-షాద్‌నగర్
దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన దళిత మహిళ సునీతను పోలీసులు ఇబ్బందులకు గురిచేసిన కేసులో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపించి, బాధితురాలికి న్యాయం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ బి.పద్మ డిమాండ్ చేశారు. బాధిత మహిళను మంగళవారం పరామర్శించి, ఆమె క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. నేరం ఏదైనా సరే మహిళను విచారణ చేయాలంటే మహిళా పోలీసు అధికారులే విచారించాలని అన్నారు. అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రామ్‌రెడ్డి మహిళను హింసించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని కోరారు. దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో.. వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి కందుకూరు జగన్, నియోజకవర్గం కన్వీనర్ శ్రీనునాయక్, పద్మారెడ్డి తదితరులు ఉన్నారు.
డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రాంరెడ్డిని విధుల నుండి తొలగించాలి
బాధిత మహిళపై దాడికి పాల్పడిన డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రామ్‌రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు విశారాదన్ మహరాజ్ డిమాండ్ చేశారు. పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురైన సునీతను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం ఆయన పరామర్శించి, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాద్‌నగర్ ముఖ్య కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి గంటకు పైగా నిరసన తెలిపారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విశారాదన్ మహరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బాధిత మహిళపై జరిగిన దాడి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రాం రెడ్డిని విధుల నుంచి తొలగించకుండా సస్పెండ్ చేసి రెడ్లను కాపాడే పనిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. దళితు లపై చిత్తశుద్ధి ఉంటే రామ్‌రెడ్డిని వెంటనే ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసి, అతనిపై మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్య క్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేందర్ ముదిరాజ్, అబ్దుల్ రెహమాన్, మంచాల బిక్షపతి, జిల్లా కన్వీనర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.