శ్మశానవాటిక కోసం వెళితే..మోకాళ్లపై కూర్చోబెట్టిన అధికారి

నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రామంలో మరో శ్మశానవాటిక ఏర్పాటుకు అనుమతించాలని కోరేందుకు వెళ్లిన గ్రామస్థుల్లో ఓ వ్యక్తిని అధికారి శిక్షించినట్లు వీడియో వైరల్‌ కావడంతో.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లా మీర్‌గంజ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం) విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గ్రామంలో ఉన్న తమ శ్మశానవాటికను ఇతరులు ఆక్రమించారని.. మరోచోట స్థలం కేటాయించి న్యాయం చేయాలంటూ మందన్‌పుర్‌ గ్రామస్థులు ఎస్‌డీఎం కార్యాలయానికి వెళ్లారు. అధికారి ఉదిత్‌ పవార్‌కు వినతిపత్రాన్ని అందించగా.. ఆయన తమలో ఒకరిని మోకాళ్లపై వంగి కూర్చోవాలంటూ అకారణంగా శిక్షించారన్నది గ్రామస్థుల ఫిర్యాదు. ఇదే సమస్యపై ఇప్పటికి మూడుసార్లు ఆ అధికారిని కలిసినట్లు తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జిల్లా మేజిస్ట్రేట్‌ శివకాంత్‌ ద్వివేది విచారణ చేపట్టారు. ఉదిత్‌ పవార్‌ను విధుల నుంచి తొలగించి, జిల్లా యంత్రాంగానికి అటాచ్‌ చేశారు. గ్రామస్థుణ్ని శిక్షించలేదని.. తాను కార్యాలయంలోకి వచ్చేసరికే అతడు ఆ విధంగా కూర్చొని ఉన్నాడని ఉదిత్‌ చెబుతున్నారు.

Spread the love