– ఎవరిని కదిలించినా కన్నీళ్లే
– ఆసరా పించన్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు…
– రేషన్ కార్డులు, భూ వివాదాలే ప్రధాన సమస్యలు
– సమస్యల పరిష్కారానికి సర్కార్ చర్యలు తీసుకోంటుంది
– మంత్రి కొండా సురేఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”ఎవరిని కదిలించినా కన్నీళ్లే…. తమకు అన్యాయం జరిగింది, న్యాయం చేయమని వేడుకోలు… పదేండ్లుగా ఎక్కని సర్కార్ ఆఫీసు మెట్లు లేవు, కలవని నాయకులు లేరని ఒకరంటే… తమను కాదని కొంతమంది తమ అనుయాయులకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టబెట్టారని మరొకరి ఆవేదన…. పక్షవాతంతో నాలుగేళ్లుగా నడవలేని స్థితిలో ఉన్నా ఆసరా పింఛన్ ఇవ్వలేదని ఓ నిష్సహయుడు తన బాదను వెళ్లగక్కాడు” అన్ని తిరిగి చివరికి ముఖ్యమంత్రి ప్రజావాణి తలుపు తట్టాం అంటూవారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో కనిపించిన దృశ్యాలు.
మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వల్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, భూ సమస్యల పరిష్కారం కోసం, వృద్దులు వికలాంగులు, వితంతు మహిళలు, నిరు పేదలు, రైతులు క్యూకట్టారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా సంబంధిత మండల రెవెన్యూ అధికారులు, సమస్యలను బట్టి ఆయా శాఖల అధికారులకు బాధితులు గతంలో తమ తమ గోడును వెళ్లబోసు కునే వారు. ఆయా బాధితులు ఏండ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పని కాని పరిస్థితి నెలకొంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా సర్కార్ ప్రజావాణిని ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో జరుగుతున్న ఆ కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కోరిది ఒక్కో సమస్య… కదిలిస్తే కంట కన్నీరు ఒలుకుతోంది.
పింఛను ఇప్పించండి అంకుట వెంకటి, గోపాల్ నగర్, హుజూర్ నగర్
నాపేరు అంకుట వెంకటి. మాది సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ మండల గోపాల్ పూర్ గ్రామం. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం నాది. నాకు పక్షపాతం వచ్చి నాలుగేళ్లయింది. అప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటున్నాను. నా భార్య కూలి చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పింఛను ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నాను.
డబుల్ బెడ్ రూం ఇప్పించండి కౌసల్య, శ్రీరాంకాలని, బాలాపూర్, హైదరాబాద్
డబుల్ బెడ్ రూం ఇంటి కోసం రెండేండ్లుగా తిరుగుతున్నా, అధికారులు కనికరించడం లేదు. మా బస్తీలో అనర్హులకు ఇచ్చారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. భార్య భర్తలమిద్దరం అడ్డాకూలీలం. ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పించండి.
తెలంగాణ కోసం మా తండ్రి అసువులు బాసారు…ఆదుకోండి నదీంపాషా, తుప్రాన్, మెదక్,
మా తండ్రి మొల్లా గౌస్ తెలంగాణ కోసం 2010లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నా కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయాన్ని అందించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాంటి సాయం అందించలేదు. గత పదేండ్లుగా తిరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. నా కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోండి.
సమస్యల పరిష్కారానికి చర్యలు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.
ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుం టుందని దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మం తి కొండా సురేఖ చెప్పారు. మంగళవారం నిర్వ హించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతు లను ఆమె స్వీకరించారు. ప్రజావాణి కి వచ్చిన ప్రతి ఒక్క రి సమస్యను తెలుసుకుని , వారి అర్జీలను తీసు కున్నారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయి స్తున్న ట్లు తెలిపారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశం పంపుతున్నట్లు తెలిపారు.
నిధులివ్వండి ప్రజావాణిలో సర్పంచుల సంఘం వినతి
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రెండేండ్లుగా నిధులు రావట్లేదనీ, దీనివల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారంనాడిక్కడి మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్ సుర్వి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి కొలను శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనీ, డంపింగ్ యార్డులు, స్మశానవాటికలు, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ నిధుల్ని త్వరగా విడుదల చేయాలని కోరారు. కరోనా వల్ల రెండేండ్లు సర్పంచులు కాలం వృధా అయ్యిందనీ, అందువల్ల వారి పాలనా కాలం గడువును మరో ఏడాది పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.