మింగి బలిసిన కొండలన్నీ
ఆకాశానికి ఎత్తి చూస్తున్నాయి
మింగుడు పడని పేగులన్నీ
గుటకలు మింగుతున్నాయి
అప్పనంగా వచ్చిన నోట్లను
అనకొండలు మింగేస్తున్నాయి
అప్పులకుప్ప కింద తలలు
తాకట్టుకై వేచి చూస్తున్నాయి
ఆర్థిక లెక్కలన్నీ
తికమక పడుతున్నాయి
దిక్కుతోచని రాష్ట్ర గతులు
గతుకుల దారి ఎంచుకున్నాయి
ఎక్కడ వేసిన వాగ్ధానాలన్నీ
అక్కడే సేదతీరుతున్నాయి
ఆకలిగొన్న పేద కడుపులన్నీ
ఆహా కారాలు చేస్తున్నాయి
ఈ అనకొండల వింతరాజ్యంలో
మెతుకెరుగని బతుకులన్నీ
శూన్యంలో కలిసిపోతున్నాయి
తడారిపోయిన గొంతులన్నీ
సొమ్మసిల్లి పడివున్నాయి
బాగా కలిగిన జేబులన్నీ
మెరుపుల్ని పుంజుకున్నాయి
నోటు ముఖం ఎరుగని జీవనాలు
వెలవెలబోతున్నాయి
ఈ అనకొండల పాలిత ప్రాంతంలో
గజాలు లెక్కన భూములన్నీ
చీలిపోతూ చిధ్రమౌతున్నాయి
ఆ పొరల మధ్యలో మొక్కలన్నీ
ఇరుక్కుపోయి నశిస్తున్నాయి
హతవిధీ ఇది కదా
ఆటవిక రాజ్య పాలనంటే
– నరెద్దుల రాజారెడ్డి, 9666016636