ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు

And government employees in RSS activities– 58 ఏండ్ల నాటి నిషేధాన్ని ఎత్తేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు భాగస్వాములు కావడంపై దీర్ఘకాలంగా అమలులో ఉన్న నిషేధాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం సోమవారం ఎత్తివేసింది. 1966 నవంబర్‌ 30, 1970 జులై 25, 1980 అక్టోబర్‌ 28 తేదీల్లో ఇచ్చిన ఆదేశాల్లో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రస్తావనను తొలగించాలని నిర్ణయించామని ప్రభుత్వం ఓ ఉత్తర్వులో తెలియజేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు. 58 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగవిరుద్ధ ఆదేశాలను మోడీ ప్రభుత్వం ఉపసం హరించుకున్నదని బీజేపీ నేత అమిత్‌ మాల్వియా ధృవీకరించారు. ‘1966 నవంబర్‌ 7న పార్లమెంట్‌ వద్ద గోవధకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. దానికి ఆర్‌ఎస్‌ఎస్‌, అప్పటి జనసంఘ్‌ మద్దతు ఇచ్చాయి. ప్రజలను సమీకరించాయి. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది చనిపోయారు. ఆర్‌ఎస్‌ఎస్‌-జనసంఘ్‌ పలుకుబడి పెరుగుతుండడంతో ఇందిరాగాంధీ కలవరపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ప్రభుతోద్యోగులు పాల్గొనరాదంటూ నిషేధం విధించారు’ అని మాల్వియా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చెప్పుకొచ్చారు. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ దీనిపై వివరణ ఇస్తూ ‘గాంధీజీ హత్యానంతరం 1948 ఫిబ్రవరిలో సర్దార్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. సత్ప్రవర్తనతో మెలగుతానని ఆర్‌ఎస్‌ఎస్‌ హామీ ఇవ్వడంతో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఆ తర్వాత కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నాగపూర్‌లో ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొనడంపై 1966లో నిషేధం విధించడం సరైన చర్యే. వాజ్‌పేయి హయాంలో కూడా నిషేధం కొనసాగింది. ఇప్పుడు దానిని ఎత్తివేశారు’ అని ఎక్స్‌లో తెలిపారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించిన నిషేధాన్ని షరతులకు లోబడి ఎత్తివేసేందుకు సర్దార్‌ పటేల్‌ అంగీకరించారు. అప్పటికి, ఇప్పటికి ఏం మార్పు జరిగింది? ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజకీయాలతో సంబంధం తగ్గిపోయిం దా?’ అని కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్‌ నేత పవన్‌ ఖేరా ప్రశ్నించారు.

Spread the love