– ఫేషియల్ రికగేషన్‌తో విద్యార్థుల హాజరు
– హైదరాబాద్ జిల్లాలో 694 బడులు
– అవకతవకలకు చెక్..
– పక్కాగా పథకాల అమలు
– 1.14లక్షల మంది విద్యార్థులు
– స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ ద్వారా నమోదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చదువులపై దృష్టిపెట్టిన విద్యాశాఖ.. ఇకపై వారి అటెండెన్స్‌పై నజర్ పెట్టనుంది. ఇందుకోసం ఫేషియల్ రికగేషన్ అటెండెన్స్‌ను (డీఎస్‌ఈ- ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) అమలు చేయనుంది. ఈ యాప్ ద్వారా ప్రతిరోజూ ఎంతమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవు తున్నారు.. మధ్యాహ్నం ఎంత మందికి భోజనం పెడుతు న్నారనే వివరాలతోపాటు విద్యార్థులు బడులకు హాజరు కాకున్నా.. రిజిస్టర్‌లో హాజరు వేయడం.. లేని విద్యార్థులను ఉన్నట్టు చూపెట్టడం, బోగస్ సంఖ్యను గుర్తించే అవకాశంతోపాటు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కాలర్‌షిప్స్ వంటివి ఎంతమందికి అందించాలనే విషయంపై ఓ క్లారిటీ రానుంది. హైదరాబాద్ జిల్లాలో ఈనెల 11వ తేదీ నుంచి విద్యార్థుల ముఖాచిత్రాలను యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమవ్వగా.. ఈనెల 20వ తేదీలోపు పూర్తి చేయనున్నారు. అనంతరం ఈ విధానం ద్వారా హాజరును అమలులోకి తీసుకురానున్నారు.
పాఠశాలల్లో పథకాల అమలులో పారదర్శకతతోపాటు అవకతవకలకు చెక్ పెట్టేందు గాను ఫెషియల్ అటెండెన్స్‌ని అమలు లోకి తెచ్చారు. విద్యార్థి ముఖంలోని కను రప్పలు, పెదాలు, ముక్కు, తదితర అవయవాలను స్కాన్ చేస్తారు. ఉపాధ్యాయుల వద్ద ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్, ట్యాబ్ ద్వారా విద్యార్థుల ముఖచిత్రాలను స్కాన్.. రిజిస్టర్ చేసి హాజరు నమోదు చేస్తారు. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు క్షణాల్లో ఈ వివరాలన్నీ చేరతాయి. ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. హాజరు శాతం తదితర వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఈ యాప్ వినియోగంపై ఇప్పటికే విద్యాశాఖాధికారులు పాఠశాలల హెచ్‌ఎంలకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 694 ప్రభుత్వ పాఠశాలలుండగా.. యూడైస్ ప్రకారం 92,623 మంది విద్యార్థులు విద్యనభ్య సిస్తున్నారు. ఇప్పటివరకు 34,247 మంది విద్యార్థుల ముఖ చిత్రాలను స్కాన్ చేసి యాప్‌లో నమోదు చేశారు. మిగతా విద్యార్థుల వివరాలు ఈ నెల 20లోపు పూర్తిచేయనున్నారు.
బోగస్ సంఖ్యకు అడ్డుకట్ట
రాష్ట్రంలో 14 జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు అమలులో ఉంది. కానీ హైదరాబాద్ జిల్లాలో అమ లులో లేదు. వలస కుటుంబాలు, ప్రయివేట్ పాఠశా లలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య మారుతూ ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు కచ్చితత్వాన్ని నిర్ధారిం చేందుకు ఫేస్ యాప్‌ను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ ఫేషియల్ అటెండెన్స్ ద్వారా విద్యార్థులు పేర్లు ఒక్కటికన్నా ఎక్కువ పాఠశాలల్లో ఉండటాన్ని అరికట్టొచ్చు. దీని ద్వారా ప్రతిరోజూ ఒక పాఠశాల, మండలంలో ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారనే విషయం తెలుస్తుంది. అలాగే మధ్యాహ్న భోజనం పథకం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, స్కాలర్‌షిప్‌లో అవకతవకలు జరిగే విషయం సైతం సులువుగా తెలియనుంది. హాజరుకాని విద్యార్థుల స్థానంలో అటెండెన్స్ వేసి.. టీచర్ పోస్టులు తగ్గకుండా చూస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త హాజరు విధానం బోగస్ సంఖ్యను ఇట్టే గుర్తించి చెక్‌పెట్ట నుంది. ఉపాధ్యాయులకు సైతం త్వరలో ఈ యాప్ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు.
ఒక్క క్లిక్‌తో.. తరగతి గది హాజరు
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘డీఎస్‌ఈ-ఎస్‌ఆర్‌ఎస్’ పేరిట ఉన్న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయో గించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. విద్యా ర్థుల రిజిస్ట్రేషన్, హాజరు, డిటేల్ రిపోర్టు అనే ఆప్షన్లు ఉంటాయి. ఓ తరగతి గదిలో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ యాప్‌లో నమోదవుతాయి. ఒక్కో విద్యార్థి పేరు క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. విద్యార్థి ముఖం రౌండ్ సర్కిల్లో ఉండేలా చూడడం తో పాటు ముఖం చుట్టూ ఎరుపు నుంచి ఆకుపచ్చ రంగు వస్తే హాజరు ఒకే అయినట్టే.
ఈ నెల 20 వరకు పూర్తి..
ఫేషియల్ యాప్ ద్వారా విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఈనెల 11 నుంచి నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాం. ఈ ప్రక్రియలో హెచ్‌ఎం లకు ఎమైనా సాంకేతిక సమస్యలు వస్తే హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరిస్తున్నాం. ఇప్పటికే రిజిస్టరైనా విద్యార్థుల హజరును ఒక్క క్లిక్‌తో యాప్ ద్వారా నమోదు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చాం.
– ఎస్.రజిత, కో-ఆర్డినేటర్, హైదరాబాద్ జిల్లా.