నవతెలంగాణ-కమ్మర్ పల్లి : తమ డిమాండ్లు పరిష్కరించాలని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది.మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారంతో తొమ్మిదవ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరం వద్ద అంగన్వాడి ఉద్యోగులు వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ర్యాలీగా వెళ్లి సమ్మె శిబిరానికి సమీపంలో ఉన్న వినాయక మండపంలో వినాయక విగ్రహానికి వినతి పత్రం అందించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో సంతోష్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ శరత్ కు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ..గత తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటినుండి నేటి ప్రత్యేక తెలంగాణ వరకు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నామన్నారు.కానీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పని భారం పెంచుతూ మానసిక ఒత్తిళ్లకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో అంగన్వాడి టీచర్ల పాత్ర ప్రధానంగా ఉన్నదని వారు గుర్తు చేశారు. తెలంగాణలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టింగ్ పదం అనేది ఉండదని కేసీఆర్ పదే పదే చెప్పారు కానీ ఎక్కడ అమలు చేయలేదని అన్నారు. అంగన్వాడీల ఉద్యోగుల పాత్ర గ్రామాలలో ప్రధానంగా ఉంటున్నదని, చిన్నపిల్లల ఆలన పాలన, పోషక ఆహారం తినిపించడంలో ముందు బాగాన ఉంటున్న అంగన్వాడీలను ఈరోజు ప్రభుత్వం చిన్నచూపు చూడడం శోచనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ భీమ్ గల్ ప్రాజెక్టు ఉపాధ్యక్షురాలు యమున, మండల అధ్యక్షురాలు మంజుల, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.