చెవుల్లో పూలు పెట్టుకొని అంగన్వాడీల నిరసన

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : తమ డిమాండ్లు పరిష్కరించాలని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె కొనసాగుతుంది.మండల కేంద్రంలోని హాస కొత్తూర్ చౌరస్తా వద్ద నిర్వహిస్తున్న నిరవధిక  సమ్మె  మంగళవారంతో 16వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరం వద్ద అంగన్వాడి ఉద్యోగులు చెవుల్లో పూలు పెట్టుకొని  ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీ ఉద్యోగులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు.16 రోజులగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అంగన్వాడి ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతోపాటు రూ.26వేల వేతనం చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు మంజుల, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love