అంగన్‌వాడీలకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలి

– నేడు కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయండి
– సమస్యలు పరిష్కరించేవరకూ పోరాడుతాం
– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌.రాజు
– తొమ్మిదవ రోజుకు చేరిన సమ్మె
నవతెలంగాణ-కందుకూరు
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌. రాజు అన్నారు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్క రించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. కందుకూరు మండల కేంద్రం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో మంగళవారం కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్‌ మండలాల్లోని అంగన్‌వాడీ టీచర్లు సీఐటీయూ మండల కన్వీనర్‌ బుట్టి బాలరాజు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.26 వేల వేతనం, ఆయాలకు రూ.20వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ చేసి, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ టీచర్లకు రూ.పది లక్షలు, ఆయాలకు రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. వీటితోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఇవ్వాలన్నారు. వయోపరిమితి 64 నుంచి 61 ఏండ్ల వరకూ తగ్గించాలని కోరారు. అంగన్వాడీలకు ఆదునపు బాధ్యతలు బీ ఎల్‌ ఓ తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామచందర్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అల్వాల రవికుమార్‌, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుడ్డీరపు శ్రీనివాస్‌, మండల కమిటీ సభ్యులు చందు, సీఐటీయూ మహేశ్వరం మండలం నాయకులు శేఖర్‌, సత్యం, బాలకృష్ణ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

 

Spread the love