– టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి
– అవకాశవాదులకు సీట్లివ్వడంపై ప్రశ్నిస్తున్న వైనం
– పార్టీ కోసం పనిచేస్తున్నా పట్టించుకోకపోవడంపై నిలదీత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ క్షేత్రస్థాయిలో ఎంతోకొంత పునాది వేసుకున్న దంటే దానికి యువతే కారణం. ఇప్పుడు ఆ యువతే బీజేపీ నాయకత్వంపై తిరగబడుతున్నది. టికెట్ల కేటాయింపులో తమకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నది. పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న తమనే పట్టించుకోకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశవాదులకు సీట్లివ్వడంపై ప్రశ్నిస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో యువ నాయకులకు కనీసం 10 శాతం టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ను బీజేవైఎం తెరపైకి తెచ్చింది. కానీ, రాష్ట్ర నాయకత్వం దీన్నేం పట్టించుకోలేదు. బీజేపీ భావజాలంతో సంబంధం లేని వారికి టికెట్లు కేటాయిస్తూ పోతున్నది. విద్యార్థి విభాగం నుంచి క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని యువతలో ఎక్కిస్తూ బీజేపీని బలోపేతం చేస్తున్న తమకు పార్టీలో ప్రాధాన్యత ఎందుకివ్వడం లేదని రాష్ట్ర నాయకత్వాన్ని యువనాయకులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ కోసం ఆశపడి వస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధాంత భావజాలం లేకుండా తమ అవసరం కోసం పార్టీలోకి వచ్చే వారు ఎన్నికలు అయిపోగానే తమ దారి తాము చూసుకుంటారనీ, అలాంటి వారికి సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓడినా, గెలిచినా పార్టీ కోసం కష్టపడి పనిచేసేది యువమోర్చా నాయకులే అని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ యువ నేత రాకేశ్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. భావోద్వేగాలను రెచ్చగొట్టి యువతను ఆకర్షిస్తున్న బీజేపీ..రాజకీయంగా వాడకుంటున్నదని ఆయన స్వయంగా ఆరోపిస్తున్న విషయం విదితమే. ఒక్క తేజస్వీ సూర్యను ఎంపీగా చేసి దేశానికంతా ఆయన్నే చూపుతున్నదనీ, ఆయన తప్ప పార్టీల్లో యువకులెవ్వరూ లేరా? అని పార్టీని కడిగిపారేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నాయకత్వం తీరుపై గోషామహల్ సీటు ఆశించిన విక్రమ్ గౌడ్ కూడా ఆగ్రహంతో ఉన్నారు.
ముషీరాబాద్ టికెట్ రాకపోవడంతో దత్తాత్రేయ బిడ్డ బండారు విజయలక్ష్మి కూడా అలిగి కూర్చున్నది. బీజేపీ యువ నేతలు గడీల శ్రీకాంత్‌గౌడ్, సింగాయపల్లి గోపి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కూడా పార్టీ నేతల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టికెట్‌ను బీజేవైఎం నేతలు భానుప్రసాద్, సాయి ఆశిస్తున్నారు
. ఇప్పటి వరకూ ఆ స్థానంలో అభ్యర్థినే ప్రకటించలేదు. పొత్తుల్లో భాగంగా చివరి జాబితాలో ఆ సీటును జనసేనకు కేటాయించబోతున్నారనే ప్రచారంతో వారిద్దరూ అలర్ట్ అయ్యారు. పార్టీ ఎదుగుదలలో యువనాయకత్వం కృషిని జాతీయస్థాయి నాయకులకు వివరించి సీటు తెచ్చుకునే పనిలో వారిద్దరూ ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ టికెట్ దక్కకపోతే వారు పార్టీకి దూరమయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ మొదలైంది.