పోలీసుల లాఠీచార్జిపై ఆగ్రహం..

– తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట రాస్తారోకోలు
– సీఎం దిష్టిబొమ్మ దహనం
– ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తం
– 11వ రోజూ కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె
నవతెలంగాణ-విలేకరులు
కలెక్టరేట్ల ముట్టడిలో అంగన్‌వాడీలపై పోలీసులు లాఠీచార్జిని నిరసిస్తూ గురువారం తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట రాస్తారోకో నిర్వహించి, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ, హెల్పర్స్‌ యూనియన్‌ జాయింట్‌ రాష్ట్ర కమిటీల (సీఐటీయూ, ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11వ రోజూ సమ్మె కొనసాగింది.
ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు వర్షంలోనూ తమ నిరసనలు కొనసాగించారు. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించి అంగన్‌వాడీలను భయాందోళనకు గురి చేసేందుకు ప్రయత్నించారు. అయినా మొక్కవోని దీక్షతో పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు చేరుకోవడంతో వందలాంది మంది అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు చేరుకోవడంతో పోలీసులు కలెక్టరేట్‌ గేట్లు మూసివేశారు. దాంతో ఆగ్రహించిన అంగన్‌వాడీలు గేట్లను తోసే ప్రయత్నంలో భాగంగా పైకెక్కారు. పోలీసులు వారిని వారించడానికి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులను ఎదిరించి లోపలికి చొచ్చుకెళ్లారు. దాంతో అంగన్‌వాడీలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. పోలీసు ఆందోళనకారులను చెదరగొట్టి సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు. అంగన్‌వాడీలు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మధు మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం అపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్‌, ముంజం శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఓదెలు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించి, సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. చేవెళ్ల, కందుకూరు, మంచాలలలో అంగన్‌వాడీలు నిరసన ర్యాలీలు నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. షాద్‌నగర్‌ పట్టణంలో అంగన్‌వాడీలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఫరూక్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి షాద్‌నగర్‌ ప్రధాన కూడలి వరకు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మ దహనం చేశారు. శేరిలింగంపల్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ఆందోళన చేపట్టారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీ నల్ల చీరలను ధరించి తమ నిరసన తెలిపారు.
నల్లగొండ జిల్లా సీడీపీఓ ఆఫీస్‌ ఎదుట కొనసాగుతున్న సమ్మెకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారీ ఐలయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, మహిళా కూలీల జిల్లా కన్వీనర్‌ దండంపల్లి సరోజ మద్దతు తెలిపారు. చండూరు, దేవరకొండ, నకిరేకల్‌, హాలియాలో సమ్మె కొనసాగింది. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేటలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆలేరు మండలకేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు మండల కేంద్రాల్లో దీక్ష శిబిరాల వద్ద మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం చేపట్టారు. ఇల్లందు, భద్రాచలంలో ప్రధాన సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఆయన విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

Spread the love