హద్దులు లేని హక్కుల పరిరక్షణకు – ‘అన్‌హద్‌’

”దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి – మానవత్వాన్ని అధిగమించనీయను.”
– విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌.
2002లో గుజరాత్‌లో జరిగిన మారణ హౌమానికి ప్రతిస్పందనగా మార్చి 2003లో ANHAD (Act now for Hormony and Democracy) పేరుతో ఒక ఎన్‌జీఓ సంస్థ రూపు దిద్దుకుంటుంది. ఆ సంస్థ ఇరవైయేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్‌హద్‌ కార్యక్రమాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సి ఉంది. అలాంటి ఎన్‌జివోల అవసరం నేడు దేశంలో ఎంతగా ఉందో ఆలోచించుకోవాల్సి ఉంది. దేశంలో నాశనమవుతున్న మానవహక్కులు, అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం, బద్దలవుతున్న సామాజిక న్యాయం, బీటలు బారుతున్న సుహృద్భావం – కొంత మంది సామాజిక కార్యకర్తల్ని, మార్కిస్టు మేధావుల్ని స్థిమితంగా కూర్చోనీయ లేదు. వారు సత్వరమే ‘అన్‌హద్‌’కు రూపకల్పన చేసి, కార్యరంగంలోకి దూకారు. సామాజిక కార్యకర్త షబ్మమ్‌ హాష్మి, ఆమె సోదరుడు సఫ్‌దర్‌ హాష్మి, మార్క్సిస్టు చరిత్రకారుడు ప్రొఫెసర్‌ కె.ఎన్‌. ఫణిక్కర్‌, సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌ ప్రభృతులంతా కలిసి ఢిల్లీలో ‘అన్‌హద్‌’ను ప్రారంభించారు. ‘అన్‌హద్‌’ అంటే హద్దులు లేనిది. కుల మతాల మధ్య, ప్రాంతాల మధ్య ద్వేషాన్ని నింపి, మనిషిని మనిషితో కలవ కుండా చేస్తున్న వారి ఆటలు కట్టించడానికి అన్‌హద్‌ ఏర్పడింది.
”మతతత్వాన్ని మట్టుబెట్టే పని ముస్లింలది, సిక్కులది, క్రైస్తవులది, హిందువులది – అంతే కాదు, భారతీయులందరిదీ! దీని కోసం వారంతా మతతత్వ దృక్పథాన్ని అధిగమించి నిజమైన జాతీయవాద మనస్తత్వాన్ని అలవరుచుకోవాలి!!” అని అన్నారు సుభాష్‌ చంద్రబోస్‌. మనిషి మనిషిని బతికించు కోవాలని, మనిషి మనిషిని గౌరవించుకోవాలని, మనిషి మనిషిని ప్రేమించాలని, మనిషే కేంద్రంగా జరుగుతూ వస్తున్న అన్ని కార్యక్రమాలనూ ప్రోత్సహించాలని అన్‌హద్‌ సంస్థ నిర్వాహకులు దృఢ నిశ్చయంతో ముందుకు నడిచారు. సమాజాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన, పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం ఒకటుంది. కేవలం నిజాయితీ, నిబద్దతల మీద నడుస్తున్న ఈ ఎన్‌జిఓకు ఏ ఆర్థిక వనరులూ లేవు. చెప్పుకోదగ్గ నెట్‌వర్కూ లేదు. అయినా, అది శక్తికి మించి దేశ పౌరులకు స్ఫూర్తినందిస్తూ ఉంది. నాటక కర్త సఫ్‌దర్‌ హాష్మి, అన్‌హద్‌ కంటే ముందు ‘సహెమత్‌’ ూAనజువీAు అనే సంస్థను రూపొందించారు. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది. సహెమత్‌ – అంటే అంగీకరించడం. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి ప్రజలకు వివరించడం – ‘అన్‌హద్‌’ ఉద్దేశం. ముఖ్యంగా గుజరాత్‌లోను, కశ్మీర్‌లోనూ మతతత్వ వాదుల దాడుల్ని ఎదుర్కొవడం, వారిని ధైర్యంగా చట్టానికి అప్పగించడం ఈ సంస్థ సాధించిన విజయాలలో ముఖ్యమైంది. అన్‌హద్‌ ఆలోచనల్ని, ఆలోచనల్ని, ఆశయాల్ని జనంలోకి విరివిగా తీసుకుపోవడానికి పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించడం జరిగింది. ”దురాగతాలను బహిర్గతం చేస్తూ, ఉన్నత నైతిక భావాలను వ్యాప్తి చేయడం కంటే మిన్న అయిన లక్ష్యమూ – ప్రయోజనమూ సాహిత్యానికి మరొకటి లేదు” అని మన తెలుగు మహాకవి గురజాడ అప్పారావు అన్నారు కదా? అన్‌హద్‌ సభ్యులు గ్రూపులుగా ఏర్పడి, జనంలో తిరుగుతూ ప్రజలకు మానవ హక్కుల గూర్చి, రాజ్యాంగంలోని కీలక అంశాల గూర్చి, మానవీయ విలువల గూర్చి విరివిగా ప్రచారం చేయడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది. అన్‌హద్‌లో భాగస్వాములు కావడం ఈ దేశ పౌరులందరి బాధ్యత!
ఇంత వరకు జరిగిన, జరుగుతున్న పరిశోధనలన్నీ మనుషులు చేసినవే. మానవ శ్రేయస్సు కోసం చేసినవే తప్ప, ఏ అతీతశక్తి మహిమా కాదు. స్వార్థ చింతనతో అబద్దాలు ప్రచారం చేసి, అధికార పీఠం దక్కించుకుని, మారణహౌమాలు సృష్టిస్తున్న వారు మన కళ్ళముందే ఉన్నారు. భ్రమల్లో బతకకుండా వాస్తవాల్ని గ్రహిస్తూ – కుట్రదారుల మోసాల్ని తిప్పికొట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజలే ఐకమత్యంతో పరిపాలకుల మీద ఒత్తిడి పెంచాలి. అందరికీ అవకాశాలు, అందరికీ న్యాయం, సమంగా అందే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా కుల, మత, ప్రాంతీయ, లింగ బేధాల హద్దుల్ని చెరిపేసి, మనుషులంతా ఒక్కటే – అనే ఆలోచనలోకి రావాల్సి ఉంది. ‘అన్‌హద్‌’ ఎన్‌జిఓను ఒక ట్రస్ట్‌గా రిజిస్టర్‌ చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలోని కన్నింగ్‌ లేన్‌లో ఉంది. మొదట ఆరుగురు ట్రస్టీ సభ్యులుగా ఉన్నారు. వారు – షబ్మమ్‌ హాష్మి, అబన్‌ రాజా, అమృతా నాండి, హర్ష్‌ మందర్‌, శుభా మీనన్‌, ముఖ్తార్‌ షేక్‌! ఆ తర్వాత కాలంలో ప్రొఫెసర్‌ కె.ఎన్‌.ఫణిక్కర్‌, ప్రొఫెసర్‌ రామ్‌ పున్యాని, శోభా ముద్గల్‌ (సంగీత కారిణి) కమలాభాసిన్‌ (స్త్రివాద కవయిత్రి) సయీద్‌ అఖ్తర్‌ మిర్జా (రచయిత – చిత్ర దర్శకుడు) ధృవ్‌ సంగం (గాయకుడు – సంగీతకారుడు) మొదలైన ప్రముఖులంతా గత పదహారేళ్ళుగా ఆ ట్రస్ట్‌లో ఉన్నారు.
2002 గుజరాత్‌ మారణ హౌమానికి బలి అయి, నిరాశ్రయులైన బాలబాలికల్ని అన్‌హద్‌ సంరక్షించింది. గుజరత్‌ అల్లర్లపై వచ్చిన ‘పర్జానియా’ వంటి చలన చిత్రాలు వారికి చూపించి, వాస్తవాలు అర్థమయ్యేట్టుగా చేసింది. 2010లో ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్మీ-సెక్యూరిటీ బలగాలు కశ్మీర్‌ లోయలో ఎన్నో దురాగతాలకు పాల్పడ్డాయని ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని అపహాస్యం చేసాయనీ – అపహాస్యమే కాదు కొన్ని చోట్ల అవి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయని అందుకు కారణం ఇప్పటి కేంద్ర ప్రభుత్వమేననీ – అన్‌హద్‌ నిర్భయంగా చెప్పగలిగింది. అలాగే బట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ కేసు గురించి దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులను అన్‌హద్‌ డిమాండ్‌ చేసింది. 2009లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు మీద ఈ ఎన్‌జిఓ సంస్థ దృష్టి సారించింది. ఆ విషయాన్ని దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయడానికి ‘రిజర్వేషన్‌ ఎక్స్‌ప్రెస్‌’ అనే కార్యక్రమం రూపొందించుకుంది. దేశంలో దుష్టపాలనకు మూలకారణమైన ఆరెస్సెస్‌ను వెంటనే నిషేధించాలని అన్‌హద్‌ 24 మార్చి 2012న డిమాండ్‌ చేసింది. దేశంలో ముస్లింల అస్థిత్వాన్ని విశ్లేషించడానికి జాతీయ సమావేశాలు నిర్వహించింది. (2010-2012) ఉగ్రవాదం పేరుతో అన్యాయంగా మైనార్టీల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని నిరసిస్తూ 2010లోను 2012లోనూ కార్యక్రమాలు చేపట్టింది. ధులే – అల్లర్ల మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి, మానవ హక్కుల పరిరక్షణకు సామాజిక న్యాయ స్థాపనకు పోరాడింది. అన్‌హద్‌ చేపట్టిన కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే – దేశంలో ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా అన్‌హద్‌ ఎండగడుతూనే వచ్చింది. నిరంతరం తన పోరాటం కొనసాగిస్తూనే ఉంది. స్వర్గమంటే ఎక్కడో లేదు. దాన్ని ఈ ధరాతలం మీద మనమంతా కలిసి నిర్మించుకోవాల్సి ఉందన్న మాటను వాస్తవంలోకి తేవడానికి దేశ పౌరులంతా కంకణ బద్దులవ్వాలి.
దేశ పౌరుల్ని అంధ విశ్వాసాల్లో ముంచేయడానికి నేటి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. ‘భారత్‌ గౌరవ్‌’ పేరుతో ఉత్తర భారతదేశంలో ఒక రైలు నడుపుతోంది. అది అక్కడి పుణ్యక్షేత్రాలన్నింటినీ చుట్టుకుని వస్తుంది. అంటే… దేశ పౌరులు దైవ భావనలోంచి బయటపడి ఎక్కడ వైజ్ఞానికతను అందిపుచ్చుకుంటారోనన్నది ప్రభుత్వాధినేతల భయం. అలాంటిదే ‘గర్భసంస్కార్‌’ ఒకటైతే, పాఠశాలలో భగవద్గీతను బోధించడం మరొకటి. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ సమవర్ధనీ న్యాస్‌ ‘గర్భ సంస్కార్‌’ కార్యక్రమం రూపొందించింది. గర్భంలో ఉన్నప్పుడే శిశువుకు భారతీయ విలువలు, సంస్కృతి నేర్పించాలని అందుకు గర్భిణుల సహకారం తీసుకోవాలని సమవర్ధనీ న్యాస్‌ డాక్టర్లను కోరింది. పద్మవ్యూహం ఎలా ఛేదించాలో అభిమన్యుడు గర్భంలో ఉండగానే నేర్చుకున్నాడనీ, 17వ శతాబ్దంలో శివాజీ గర్భంలో ఉండగానే తల్లి జిజియాబాయి చెప్పిన విషయాలు నేర్చుకున్నాడనీ… సమవర్ధినీ న్యాస్‌ జాతీయ కార్యదర్శి ప్రకటించారు. ‘మనుశాస్త్రం’ భారత ప్రాచీన రాజ్యాంగం – అని ఇటీవల కొందరు ప్రకటించారు. పురాణానికి, రాజ్యాంగానికి తేడా తెలుసుకోలేని మందబుద్ధులు అంతకన్నా ఇంకేం చేయగలరూ? ఆ ప్రాచీన రాజ్యాంగం కావాలనుకునే వారు వెళ్ళగలిగితే ఆ ప్రాచీన యుగానికే వెళ్ళి బతకాలి. ఈ అత్యాధునిక వైజ్ఞానిక యుగంలో వారికి పనేమిటీ? ఇక్కడ వారికి ఏం అర్థమవుతుంది గనుక ”దేశం నుండి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక నార్త్‌ ఇండియా కంపెనీ వచ్చింది” అని అన్నారు సినీ నటుడు కమల్‌హాసన్‌.
”నరేంద్రమోడీ, అమిత్‌షాలతో కలిసి ఈ దేశ ప్రజలనందరినీ నేను ఘోరంగా మోసం చేశాను. బీజేపీ చేసిన స్కాంలలో నాది కూడా సమానమైన భాగస్వామ్యం ఉంది. ఈ అపరాధ భావంతో నేను చచ్చిపోదలుచుకోలేదు. అందుకే, నన్ను క్షమించమని భారతీయులందరినీ వేడుకుంటున్నాను” అని చనిపోవడానికి ముందు రామ్‌ జత్మలాని (14 సెప్టెంబర్‌ 1923 – 8 సెప్టెంబర్‌ 2019) ప్రకటించాడు. ఆ ప్రకటన పత్రికలు అచ్చేశాయి. ఆయన మాట్లాడిన వీడియో కూడా దేశ ప్రజలకు అందింది. రామ్‌ జఠ్మలాని సుప్రీంకోర్టు లాయరు, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అంతే కాదు, రాజకీయ వేత్త, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి. దీని వల్ల ఏం తెలుస్తోంది అంటే… నిజాలు దాగవు! అని. డిస్కవరి సైన్స్‌ వంటి టెలివిజన్‌ ఛానల్‌ కార్యక్రమాలు ఒక్క పదినిముషాలు శ్రద్ధగా గమనిస్తే చాలు, మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఎంత సాధించాడు? అనేది అర్థమవుతుంది. కానీ, మన ప్రభుత్వాలు విచక్షణా జ్ఞానాన్ని కప్పిపెట్టే విధంగా – రైతులు ఆవు ఆధారిత వ్యవసాయం చేయాలని ప్రకటిస్తాయి. ఆవు మూత్రం, ఆవు పేడ ప్రదర్శిస్తూ ప్రజల్ని వెనక్కి అనాగరిక సమాజంలోకి నెట్టేస్తాయి. ప్రభుత్వాలు చేస్తున్న అనైతిక దోపిడీని ఎవరూ ప్రశ్నించగూడదని ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్నారు. కానీ, అది ఎల్లకాలం సాగుతుందా? రైతు చట్టాల్ని ప్రజలు ఎలా తిప్పికొట్టారో గత సంవత్సరం చూశాం కదా? అదే స్ఫూర్తిని తీసుకుని ప్రజలు ఇతర విషయాలలో కూడా వివేకవంతంగా ఎందుకు స్పందించరూ? వారికి కావల్సిందేదో వారు ఎందుకు సాధించుకోరూ? ‘అన్‌హద్‌’ లాంటి ఎన్‌జిఓలు ప్రజలకు అండగా ఉంటూనే ఉన్నాయి.
నిత్య జీవితంలోని ఒక విషయం పరిశీలిద్దాం! చిన్న పిల్లల కల్పితాలకు, ఊహలకు అంతే ఉండదు. వాళ్ళు పులితొడుగులు వేసుకుని, పులిలాగా అరుస్తూ, ఇంట్లో వాళ్ళను, చుట్టూ ఉన్న సన్నిహితులను భయపెడుతుంటారు. ఆ మరునాడే స్పైడర్‌మ్యాన్‌ ముసుగు వేసుకుని – అంతెత్తున గాలిలో ఎగిరిపోతున్నట్టు ఊహించుకుంటారు. ఈ పిల్ల చేష్టలను చూసి పెద్దవారెవరైనా, ఎప్పుడైనా భయపడతారా? లేదు. అలా ఎన్నడూ జరగదు! ఇప్పుడు పెద్దవాళ్ళే రకరకాల ముసుగులు వేసుకుని వీధుల్లోకి వచ్చి అరుస్తూ – హిందుత్వ పేరుతో కేకలేస్తున్నారు. ఈ దేశ ప్రజలేమైనా భయపడుతున్నారా? లేదే? వారి పిల్ల చేష్టలను చూసి జాలిపడుతున్నారు. వారి ఎదుగుదలను కాంక్షిస్తున్నారు. వారి పిచ్చి ఇంకా ముదిరితే దేశ వ్యాప్తంగా ‘షహీన్‌ బాగ్‌’లు వెలుస్తాయి. ‘అన్‌హద్‌’ ఎన్‌జిఓలు పుట్టుకొస్తాయి. హద్దులు గీసేవారినే హద్దులో పెడతాయి!!
వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ
అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love