ప్రియుడి కోసం పాక్ వెళ్లిన అంజూ త్వరలో భారత్ కు..

నవతెలంగాన – హైదరాబాద్: ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజు భారత్ కు తిరిగి రానుందని సమాచారం. ఇందుకోసం పాకిస్థాన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుందని, పర్మిషన్ రాగానే రాజస్థాన్ కు వస్తుందని ఆమె పాక్ భర్త నస్రుల్లా చెప్పారు. పిల్లలపై బెంగతో గత నెలలో అంజు మానసికంగా కుంగిపోయిందని వివరించారు. పిల్లలను చూసేందుకు రాజస్థాన్ వెళ్లాలని తను నిర్ణయించుకుందని, కూతురు కొడుకును చూసి తిరిగి పాకిస్థాన్ వస్తుందని నస్రుల్లా చెప్పారు. రాజస్థాన్ కు చెందిన అంజుకు 34 ఏళ్లు.. భర్తతో పాటు 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే, ఫేస్ బుక్ లో పరిచయమైన పాకిస్థాన్ యువకుడు నస్రుల్లా (29)ను ప్రేమించి, అతడి కోసం ఆగస్టులో వాఘా బార్డర్ దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టింది. ఆపై మతం మార్చుకుని ఫాతిమాగా మారి నస్రుల్లాను పెళ్లాడింది. ఇకపై పాకిస్థానే తన ఇల్లు అని పేర్కొంది. పాక్ ప్రభుత్వం ఆమె వీసాను ఏడాది పాటు పొడిగించింది. ఈ క్రమంలో అంజు కొన్ని రోజులుగా పిల్లల కోసం బెంగ పెట్టుకుందని నస్రుల్లా చెప్పారు. పిల్లలను చూసేందుకు ఇండియా వెళ్లి వస్తానని చెప్పడంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని వివరించారు.

Spread the love