మరో 17 బీసీ డిగ్రీ గురుకులాలు మంజూరు…

నవతెలంగాణ – హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 17 బీసీ డిగ్రీ గురుకులాలు మంజూరయ్యాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త డిగ్రీ గురుకులాల్లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2022-23లో 15 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, తాజాగా జిల్లాకో డిగ్రీ గురుకుల కాలేజీ ఏర్పాటైనట్టు వెల్లడించారు. బీసీలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనమని మంత్రి గంగుల చెప్పారు. సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో బీసీ గురుకులాలను దశలవారీగా 327కు పెంచుకోవడం బీసీలకు గర్వకారణమని చెప్పారు. బీసీ గురుకులాల్లో 1,68,000 పైచిలుకు విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతూ, తెలంగాణ కీర్తి పతాకను వినువీధుల్లో ఎగిరేయడం సంతోషంగా ఉన్నదని మంత్రి పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అట్టడుగుకు నెట్టివేయబడిన బీసీల జీవితాల్లో సీఎం కేసీఆర్‌ స్వర్ణయుగం తెస్తున్నారని తెలిపారు. అనునిత్యం సబ్బండ వర్గాల కోసం ఆలోచించే సీఎం వెనుకబడిన వారికి విద్యను మరింత చేరువ చేశారని బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు.

Spread the love