మధ్యప్రదేశ్‌లో మరో దారుణం

– సత్నా జిల్లాలో మైనర్‌పై లైంగికదాడి
– నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన
భోపాల్‌ : బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు భద్రత కరువైంది. సత్నా జిల్లాలోని ఒక గ్రామంలో ఒక బాలిక (17)పై లైంగికదాడి జరిగింది. నిందితుడు (19)ని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఇక్కడ ఒక బాలికపై లైంగిదాడి చోటు చేసుకున్నది. మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటనే జరగటం అక్కడి మహిళల్లో ఆందోళన కలిగిస్తున్నది.పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకున్నది. యువతి కుటుంబ సభ్యులు రామ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. నిందితుడు విజరు సాకేత్‌ (19) శుక్రవారం మధ్యాహ్నం నిర్జన ప్రాంతంలో బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అయితే, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని నిందితుడు బాధిత బాలికను చంపుతామని బెదిరించాడు. భయాందోళనకు గురైన బాలిక తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు. అయితే, ఎట్టకేలకు జరిగిన ఘటనను శనివారం రోజు బాధితురాలు తన కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి పోక్సో, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గురువారం సాత్నా జిల్లాలోని మైహార్‌ పట్టణంలోని ఒక ప్రసిద్ధ దేవాలయాన్ని నిర్వహించే ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏండ్ల బాలికపై లైంగికదాడి చేసి గాయపరిచారు. ఇద్దరు నిందితులు రవీంద్ర కుమార్‌, అతుల్‌ భడోలియాలను ఈ సంఘటన తరువాత అరెస్టు చేశారు. అయితే, రాష్ట్రంలో బాలికలు, మహిళలు, గిరిజనులపై దాడులు నిత్యకృత్యమవటం పట్ల మహిళ సంఘాలు, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ సర్కారు వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love