మరో పడవ బోల్తా.. 86 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్‌షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంజిన్​ ఫెయిల్యూర్​ కావడం వల్లే పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 86 మంది మరణించారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద పడవ ప్రమాదమని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు.
కాగా, దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదు. జనం పడవ ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. పడవ ప్రమాదాలు ఆ దేశంలో సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి 24 మందికి పైగా చనిపోయారు. అలాగే, సోమాలియా, ఇథియోపియాలకు చెందిన వలసదారుల 260 మంది వలసదారులతో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ మంగళవారం యెమెన్‌ తీరంలో మునిగిపోవడంతో 49 మంది చనిపోయారు. మరో 140 మంది గల్లంతైపోయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయం మంగళవారం వెల్లడించింది.

Spread the love