నవతెలంగాణ-హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ఇప్పటికే ఆయనపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. చాలా వ్యవహారాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాసింగ్ వివాదంతో ఏకంగా పార్టీ కొన్ని రోజులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది. సుల్తాన్ బజార్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద రాజాసింగ్ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ఆయన ఎన్నికల నియమావళి ఉల్లఘించినట్లు ఎస్‌ఐ మధుసూధన్ పేర్కొన్నారు. ఐపీసీ 188,290 రెడ్ విత్ 34, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18వ తేదీన కేసు నమోదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది.